- పదవులు వస్తుంటాయి.. పోతుంటాయి.. అవి ‘తోకలు’ మాత్రమే..
మధిర, వెలుగు : ‘ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుని, వారి కష్టసుఖాల్లో తోడుండే వారే నిజమైన నాయకులుగా గుర్తింపు పొందుతారు. పదవులు వస్తుంటాయి.. పోతుంటాయి, రాజకీయంలో పదవులు శాశ్వతం కాదు.. అవి కేవలం తోకలు మాత్రమే’ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లతో ఆదివారం ఖమ్మం జిల్లా మధిరలోని తన క్యాంప్ ఆఫీస్‌లో మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ... నాయకత్వం అంటే అధికారం చలాయించడం కాదని, ప్రజల హృదయాలను గెలుచుకోవడమని చెప్పారు.
తమను నమ్మి ఓటేసిన వారు ఆపదలో ఉంటే భరోసా కల్పించినప్పుడే నాయకుడి విజయం సార్థకం అవుతుందన్నారు. కాంగ్రెస్ సిద్ధాంతాలకు కట్టుబడి, క్రమశిక్షణతో ప్రజలకు సేవ చేయాలని కౌన్సిలర్లకు సూచించారు. మధిర పట్టణాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. మధిర మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి పేరును ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండా సురేఖ అధికారికంగా ప్రకటిస్తారని వెల్లడించారు. చైర్‌పర్సన్ అభ్యర్థి ఎంపికలో ఎలాంటి తారతమ్యాలు ఉండవని, అర్హత, పార్టీ విధేయత ఆధారంగానే ఎంపిక ఉంటుందన్నారు.
చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నిక సందర్భంగా విప్ జారీ చేసే అధికారాన్ని కోన ధనికుమార్‌కు ఇచ్చినట్లు ప్రకటించారు. అనంతరం కౌన్సిలర్లను సన్మానించారు. అనంతరం మధిరలోని టీవీఎం పాఠశాలలో జరిగిన పూర్వవిద్యార్ధుల సమ్మేళనంలో పాల్గొన్నారు. బడ్జెట్‌లో విద్యకు పెద్దపీట వేస్తూ, ప్రభుత్వ స్కూళ్ల రిపేర్లు, డిజిటల్ విద్యా విధానం, తరగతి గదుల నిర్మాణం, తాగునీటి వసతి, బాలికలకు ప్రత్యేక వసతులు, లైబ్రరీ వంటి మౌలిక సదుపాయాల కల్పన కోసం నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. పూర్వ విద్యార్థులు తమ అనుభవాలను పుస్తక రూపంలో తీసుకురావాలని సూచించారు.
