కార్పొరేట్ల కోసమే జీ రామ్‌‌ జీ చట్టం..కూలీలను వారికి అప్పగించే కుట్ర జరుగుతున్నది: డిప్యూటీ సీఎం భట్టి

కార్పొరేట్ల కోసమే జీ రామ్‌‌ జీ చట్టం..కూలీలను వారికి అప్పగించే కుట్ర జరుగుతున్నది: డిప్యూటీ సీఎం భట్టి
  •     పేదల ఆత్మగౌరవాన్ని కేంద్రం లాక్కునే ప్రయత్నం చేస్తున్నది
  •     ఉపాధి హామీ పథకం నిశ్శబ్ద విప్లవం.. కానీ.. దీనికి బీజేపీ మొదటి నుంచీ వ్యతిరేకం
  •     కొత్త చట్టాన్ని కాంగ్రెస్​ అపోజ్‌‌ చేస్తున్నదని వెల్లడి

హైదరాబాద్, వెలుగు:  మ‌‌హాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ ప‌‌థ‌‌కం పేద‌‌ల‌‌కు, మ‌‌ధ్య త‌‌ర‌‌గ‌‌తి ప్రజ‌‌ల‌‌కు ఆర్థికంగా ఊత‌‌మిచ్చిందని డిప్యూటీ సీఎం  భ‌‌ట్టి విక్రమార్క పేర్కొన్నారు.  బీజేపీ ప్రభుత్వం పేద‌‌లు, మ‌‌ధ్య త‌‌ర‌‌గ‌‌తి ప్రజ‌‌ల‌‌ను కార్పొరేట్ సంస్థల‌‌కు ధార‌‌దత్తం చేసేందుకే వీబీ జీ రామ్‌‌ జీ చ‌‌ట్టాన్ని తీసుకొచ్చిందని మండిపడ్డారు. పేదల ఆత్మగౌరవాన్ని కేంద్రం లాక్కునే ప్రయత్నం చేస్తున్నదని అన్నారు. దీనిని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని చెప్పారు.  

ఉపాధి కూలీ చ‌‌ట్టం ఒక్కసారిగా కూలీరేట్లను వంద రూపాయలకు పెంచడం ద్వారా నిశ్శబ్ద విప్లవం సృష్టించిందని, అలాంటి  చ‌‌ట్టాన్ని మార్చేసి స‌‌మాజాన్ని  ఇబ్బందుల్లోకి నెట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నదని అన్నారు. స్కీమ్‌‌ పేరు మార్పులోనే దురుద్దేశం ఉన్నదని, ఈ స్కీమ్‌‌కు మొదటినుంచీ బీజేపీ వ్యతిరేకమని తెలిపారు.

 కార్పొరేట్ శ‌‌క్తుల‌‌కు వంతపాడేలా కొత్త చ‌‌ట్టం ఉందని చెప్పారు.   శుక్రవారం అసెంబ్లీలో ‘మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం’పై సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. పేద‌‌ల జీవితాల్లో వెలుగులు నింపేందుకు  ఉపాధి హామీ స్కీమ్‌‌ను యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిందని గుర్తు చేశారు. మ‌‌హాత్మాగాంధీ దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చారని, స్వాతంత్ర్యం వచ్చిన ఆరు నెల‌‌లోపే ఆయనను హ‌‌త్య చేశార‌‌న్నారు. ఆయ‌‌న ర‌‌క్తం దేశం భూమి పొర‌‌ల్లో క‌‌లిసిపోయిందని చెప్పారు. 

వందశాతం కేంద్రమే భరించాలి.. 

జాతీయ ఉపాధి హామీ ప‌‌థ‌‌కంలో మొత్తం 100 శాతం కేంద్రమే భ‌‌రించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క డిమాండ్​ చేశారు.   గ‌‌తంలో తాము కూడా అలాగే ఇచ్చామని, బీజేపీ ప్రభుత్వం కూడా అలాగే ఇవ్వాలని కోరారు. ఉపాధి హామీ ప‌‌థ‌‌కాన్ని మార్చేసి కేంద్రం, రాష్ట్రం నిధుల ఖర్చును 60-:40కి ఎలా మారుస్తారని, ఇది రాష్ట్రాల మీద భారం వేయ‌‌డ‌‌మేనని పేర్కొన్నారు. ‘‘కేంద్రానికి క‌‌ర్నాట‌‌క రూ.100  ఇస్తే.. తిరిగి ఆ రాష్ట్రానికి కేంద్రంనుంచి రూ. 25 నుంచి రూ.30 వరకు ఫండ్స్​ ఇస్తున్నారు. త‌‌మిళ‌‌నాడు, తెలంగాణ రాష్ట్రాలు 100 రూపాయ‌‌లు ఇస్తే.. రూ. 35 నుంచి రూ. 40 ఇస్తున్నారు.  యూపీ 100 రూపాయ‌‌లు ఇస్తే 350, బిహార్ 100 రూపాయ‌‌లు ఇస్తే 650 రూపాయ‌‌లు ఇస్తున్నారు. ద‌‌క్షిణాది రాష్ట్రాలు ఏం పాపం చేసినయ్? దేశానికి జీడీపీ ఇవ్వడ‌‌మే మేం చేసిన త‌‌ప్పా?” అని నిలదీశారు.  

బీఆర్‌‌‌‌ఎస్‌‌కు పేదలపై ప్రేమ లేదు.. 

పేదలకు సంబంధించిన ముఖ్యమైన చర్చలో బీఆర్ఎస్ పాల్గొన‌‌క‌‌పోవ‌‌డం దుర‌‌దృష్టకరమని, ఆ పార్టీకి పేద‌‌ల మీద ప్రేమ లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి రాజ‌‌కీ ల‌‌బ్ధి త‌‌ప్ప ప్రజ‌‌లపై  ఆలోచ‌‌న లేదని విమ‌‌ర్శించారు. బీజేపీ తీసుకొచ్చిన చ‌‌ట్టానికి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం బీఆర్ఎస్‌‌కు లేద‌‌ని, వారికి మ‌‌ద్దతుగా ఉండే  ఆలోచ‌‌న మాత్రమే ఉందని,  ఇది రాష్ట్రానికి ఏ మాత్రం మంచిది కాద‌‌న్నారు.