- సెక్రటేరియెట్‌లో ప్రీ-బడ్జెట్ సన్నాహక సమావేశాలు
- మంత్రులు పొంగులేటి, జూపల్లి, సీతక్కతో కలిసి రివ్యూ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రాభివృద్ధి, యువతకు ఉపా ధి, పారదర్శక పాలనే లక్ష్యంగా బడ్జెట్ ప్రతిపాదనలు ఉండాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులకు సూచించారు. రాష్ట్ర పర్యాటక రంగాన్ని ఉన్నత స్థాయికి తీసుకెవెళ్లడంతో పాటు, రాబోయే మూడేండ్లలో గ్రామ పంచాయతీలన్నింటికీ శాశ్వత భవనాలు నిర్మించేలా కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. యువ తకు ఉపాధి కల్పించేలా అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ల లో (ఏటీసీ) పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా నూత న కోర్సులను ప్రవేశపెట్టి, స్కిల్ యూనివర్సిటీకి అనుసంధానం చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉన్నచోట తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలను ఒకే ప్రాంగణంలో నిర్మించే అవకాశాలను పరిశీలించాలన్నారు. సెక్రటే రియెట్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన మంగళవారం జరిగిన ప్రీ-బడ్జెట్ సన్నాహక సమావేశాల్లో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీతక్క తదితరులతో కలిసి రివ్యూ చేశా రు. అభివృద్ధి పనులతో పాటు సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు.
రోడ్లపై యాచక వృత్తిలో మగ్గుతున్న పసిపిల్లలను రక్షించి, మోడ్రన్ కిచెన్లతో కూడిన 'శిశు విహార్'లకు తరలించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. పర్యాటక రంగంలో కవ్వాల్, శ్రీశైలం వంటి టైగర్ జోన్లతో పాటు ఎకో, టెంపుల్ టూరిజాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఇసుక మైనింగ్ కేవలం గిరిజన సంఘాల ద్వారానే జరిగేలా ఐటీడీఏలు చర్యలు తీసుకుని, వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలన్నారు. రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న డ్రగ్స్ మహమ్మారి నిర్మూలనకు గ్రామస్థాయిలో కళారూపాల ద్వారా విస్తృత ప్రచారం కల్పించనున్నట్టు డిప్యూటీ సీం భట్టి వెల్లడించారు.
రెవెన్యూ శాఖలో కీలక సంస్కరణలు: పొంగులేటి
భూ లావాదేవీల్లో జాప్యాన్ని నివారించి, రైతులకు అత్యుత్తమ సేవలు అందించే దిశగా రెవెన్యూ శాఖలో కీలక సంస్కరణలు తేనున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, సర్వే విభాగాలను ఒకే గొడుగు కిందకు తెస్తూ త్వరలోనే ఒక ప్రత్యేక పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు ప్రకటించారు. పాత పద్ధతులకు స్వస్తి పలికి అత్యాధునిక 'రోవర్ల'తో భూముల సర్వే చేపడతామన్నారు.
ఇప్పటికే 460 రోవర్లు కొనుగోలు చేశామని, బడ్జెట్‌లో మరో 400 రోవర్లకు నిధులు కేటాయించాలని కోరారు. ముఖ్యంగా నక్షా (మ్యాప్) లేని 373 గ్రామాల్లో రీ-సర్వే చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ప్రస్తుతం అద్దె భవనాల్లో నడుస్తున్న ఆర్డీవో, తహసీల్దార్ ఆఫీసులకు శాశ్వత భవనాలు నిర్మించేలా రాబోయే బడ్జెట్‌లో తగిన నిధులు కేటాయించాలని పొంగులేటి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
