
- సమ్మె విరమించాలని కోరినం.. సానుకూలంగా స్పందించారు: డిప్యూటీ సీఎం భట్టి
- నేటి బంద్ యథాతథం: కాలేజీల మేనేజ్మెంట్లు
హైదరాబాద్, వెలుగు: ప్రొఫెషనల్ ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలతో ఆదివారం రాత్రి వరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చర్చలు జరిపారు. సోమవారం కూడా చర్చలు కొనసాగుతాయని ఆయన ప్రకటించారు. ‘‘ఆదివారం అయినప్పటికీ మంత్రి శ్రీధర్ బాబు, చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్, ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, కార్యదర్శులు, ప్రైవేట్ కళాశాలల యజమాన్యాలు అందరం కలిసి సుదీర్ఘంగా నాలుగు గంటల పాటు చర్చించాం. చర్చలు సానుకూలంగా కొనసాగాయి. ప్రైవేటు కళాశాలల సమస్యలను అర్థం చేసుకున్నాం. సోమవారం ప్రభుత్వ పరంగా ఒక నిర్ణయం తీసుకుంటాం.
అప్పటివరకు సమ్మెను విరమించాలని కాలేజీల యజమానులను కోరాం.. వారు సానుకూలంగా స్పందించారు” అని ఆయన పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని, లేకపోతే సోమవారం నుంచి కాలేజీలను బంద్ చేస్తామని ఇప్పటికే మేనేజ్మెంట్లు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చర్చలు జరిపింది. సోమవారం కాలేజీల బంద్ మాత్రం యథాతథంగా కొనసాగుతుందని యాజమాన్యాలు తెలిపాయి. కాగా, డిప్యూటీ సీఎం భట్టితో మీటింగ్‌కు ముందు ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హైయర్ ఇన్‌స్టిట్యూషన్స్ (ఫతీ) ఆధ్వర్యంలో జేఎన్యూఏఎఫ్యూలో కాలేజీల మేనేజ్మెంట్లు సమావేశమయ్యాయి.
దీంట్లో ఇంజినీరింగ్, ఫార్మసీ, బీఎడ్, డీఎడ్, ఎంబీఏ, ఎంసీఏ, లా, నర్సింగ్, డిగ్రీ అండ్ పీజీ కాలేజీల మేనేజ్మెంట్లు పాల్గొన్నాయి. ఫతీ చైర్మన్ ఎన్.రమేశ్‌బాబు, సెక్రటరీ జనరల్ రవికుమార్, ట్రెజరర్ కృష్ణారావు, ఆర్గనైజింగ్ సెక్రెటరీ సునీల్ కుమార్ తదితరులు మాట్లాడారు. ఈ నెల 20లోపు టోకెట్లు రిలీజ్ చేసిన రూ. 12 వందల కోట్లు రిలీజ్ చేయాలని, అప్పుడే బంద్ విరమిస్తామని స్పష్టం చేశారు. డిసెంబర్ 21లోగా మొత్తం పెండింగ్‌లోని రూ.8 వేల కోట్లు రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఫీజు బకాయిలు రిలీజ్ చేయాలని రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ, పీజీ కాలేజీల్లో సోమవారం నిరసన కార్యక్రమాలు నిర్వహించి, క్లాసులు బాయికాట్ చేస్తామని డిగ్రీ మేనేజ్మెంట్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ రెడ్డి తెలిపారు.