
- కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణం, అండర్ గ్రౌండ్ కేబుల్స్ ఏర్పాటుకుడీపీఆర్ సిద్ధం చేయండి
- విద్యుత్ శాఖ రివ్యూలో అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి ఆదేశం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను అధిగమించేందుకు తగిన చర్యలు చేపట్టాలని అధికారులను డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. బుధవారం ఎస్‌పీడీసీఎల్ ఆఫీసులో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 2034 నాటికి విద్యుత్ డిమాండ్ 33,773 మెగావాట్లకు చేరుకునే అవకాశం ఉందని కేంద్ర సంస్థల విశ్లేషణలు చెబుతున్నాయని తెలిపారు. 2024తో పోలిస్తే విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరిగిందన్నారు.
గతేడాది మార్చి 24న 308.45 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేయగా, ఈ ఏడాది మార్చి 18న 335.19 మిలియన్ యూనిట్లు సరఫరా చేసినట్లు పేర్కొన్నారు. ఇది రాష్ట్ర చరిత్రలో అత్యధికమన్నారు. అలాగే, గతేడాది మార్చి 8న 15,497 మెగావాట్ల పీక్ డిమాండ్ ఉండగా, ఈ ఏడాది మార్చి 20న 17,162 మెగావాట్లకు చేరినట్లు తెలిపారు. అయినప్పటికీ, రెప్పపాటు కూడా అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయగలిగామని, ఇది ప్రజా ప్రభుత్వం సాధించిన ఘనత అని ఆయన అన్నారు.
పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని, కొత్త సబ్‌స్టేషన్ల నిర్మాణం, అండర్‌గ్రౌండ్ కేబుల్స్ ఏర్పాటుకు డీపీఆర్ సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ప్రస్తుతం 12.5 మిలియన్ యూనిట్ల ట్రాన్స్‌ఫార్మర్ల స్థానంలో 16 మిలియన్ యూనిట్ల పవర్ ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటును వేగవంతం చేయాలని ఆదేశించారు. సబ్‌స్టేషన్ల నిర్మాణం కోసం భూమి ఇచ్చిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయంపై దృష్టి సారించాలని, రెన్యూవబుల్ ఎనర్జీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. ఈ సమావేశంలో విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణ భాస్కర్, జెన్‌కో సీఎండీ హరీశ్, ఎస్‌పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫారుకీ, ఎన్‌పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.