పేదలకు జరిగే మేలును ప్రతిపక్షాలు అడ్డుకోవద్దు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

పేదలకు జరిగే మేలును ప్రతిపక్షాలు అడ్డుకోవద్దు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  • గ్రూప్-1 ఉద్యోగాల భర్తీ చారిత్రాత్మకం

ఖమ్మం, వెలుగు:  తక్కువ కాలంలోనే వందల మందికి గ్రూప్ –1 ఉద్యోగాలు ఇచ్చి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం రికార్డు సృష్టించిందని, ఇది చారిత్రక ఘట్టమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. పదేండ్లు  పరిపాలించిన వారు ఒక్కసారి కూడా గ్రూప్ – ఉద్యోగాలు భర్తీ చేయలేదని విమర్శించారు. 

నియామకాలపై తప్పుగా మాట్లాడి కోర్టు దాకా తీసుకువెళ్లారని మండిపడ్డారు. ప్రజల దీవెనతో అధికారంలోకి వచ్చిన ఇందిరమ్మ ప్రభుత్వం వాళ్లలాగా లేదని, అధికారంలోకి వచ్చిన రెండేండ్లలోనే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేసి 70 వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. 

ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలో పలు అభివృద్ధి పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. నిరుపేద బిడ్డలు కష్టపడి చదివి ఉద్యోగాలు సంపాదిస్తే, వారి కష్టాన్ని అవహేళన చేసే విధంగా కొందరు మాట్లాడటం బాధాకరంగా ఉందన్నారు. చేసిన పనులు చెప్పుకునే సంప్రదాయం కాంగ్రెస్ ప్రభుత్వాలకు లేదని, పనులు చేసుకుంటూ ముందుకు పోవడమే తెలుసన్నారు. 

కొన్ని ప్రభుత్వాలు ఏమి చేయకుండానే ప్రచారాలతోనే బతికేస్తాయని విమర్శించారు. పేదలకు జరిగే మేలును రాజకీయ పార్టీలు తమ ఉనికి కోసం అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు.  గత ప్రభుత్వ పెద్దలు వనరులు కొల్లగొట్టి రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసాన్ని సృష్టిస్తే తమ ప్రభుత్వం ఆర్థిక పాలన సంక్షేమ వ్యవస్థలను గాడిలో పెట్టి ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతుందన్నారు. రాష్ట్రాన్ని ప్రపంచంతో పోటీపడేలా తీర్చిదిద్దాలనే ఆలోచనతో పనిచేస్తున్నామన్నారు.  మధిర నియోజకవర్గంలో ప్రతి నేత ఒక ఎమ్మెల్యేగా భావించి, ఏ పనులు కావాలో తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.