డ్యూటీలో నిర్లక్ష్యం వహిస్తే.. సహించేది లేదు: భట్టి

డ్యూటీలో నిర్లక్ష్యం వహిస్తే.. సహించేది లేదు: భట్టి
  • ప్రజలకు జవాబుదారీగా ఉండిసేవ చేయాలి: భట్టి విక్రమార్క
  • గత ప్రభుత్వంలో పని చేసిన మైండ్​సెట్ ఉండొద్దని ఆఫీసర్లకు సూచన

హైదరాబాద్, వెలుగు: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, పారదర్శకంగా, జవాబుదారీగా ప్రజలకు సేవ చేయాలని అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు అనుగుణంగా పనితీరు ఉండాలని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో పనిచేసిన పద్ధతిని కొంత మంది అధికారులు మార్చుకోవాలన్నారు. ఆ మైండ్ సెట్ ఇక ముందు ఉండకూడదని సూచించారు. సెక్రటేరియెట్​లో ఆదివారం నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్​లో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి భట్టి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులకు రాబోయే ఐదేండ్ల కాలంలో ప్రభుత్వం అమలు చేసే పథకాలు, ప్రభుత్వ లక్ష్యాలపై దిశానిర్దేశం చేశారు. ‘‘ఐదేండ్ల ప్రజా పాలన అందించే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుంది. 

సర్కార్ తీసుకొచ్చిన ప్రతి స్కీమ్​ను క్షేత్ర స్థాయిలో ప్రజల వద్దకు తీసుకెళ్లడంలో అధికారులు అంకితభావంతో పని చేయాలి. తెలంగాణను ఆరోగ్యవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలి. ప్రతి పేదోడికీ కార్పొరేట్​లో మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో రాజీవ్ ఆరోగ్య శ్రీ అమలు చేస్తున్నాం. ఈ సాయాన్ని రూ.10లక్షలకు పెంచాం. ఈ స్కీమ్​ను పకడ్బందీగా అమలు చేస్తే పేదలకు ఎంతో మేలు జరుగుతుంది”అని అధికారులకు భట్టి సూచించారు. గ్యారంటీలను కూడా ప్రభుత్వం ఏర్పడిన తొలి వంద రోజుల్లోనే కచ్చితంగా అమలు చేస్తామన్నారు. ఇందులో ఎలాంటి మార్పులు లేవని, అనుమానాలు కూడా అవసరం లేదని స్పష్టం చేశారు. గ్యారంటీలను క్షేత్ర స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.