యాదాద్రి పవర్ ప్లాంట్ జనవరి 15కల్లా జాతికి అంకితం : డిప్యూటీ సీఎం భట్టి

యాదాద్రి పవర్ ప్లాంట్ జనవరి 15కల్లా  జాతికి అంకితం : డిప్యూటీ సీఎం భట్టి
  • కాంగ్రెస్ అంటే కరెంట్ అని నిరూపించాం: డిప్యూటీ సీఎం భట్టి
  • గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్లాంట్​ను పట్టించుకోలే
  • మేము వచ్చాకే పనులు స్పీడప్ చేసినమని వెల్లడి
  • 500 మంది నిర్వాసితులకు ఉద్యోగ నియామకపత్రాలు అందజేత

హైదరాబాద్, వెలుగు: యాదాద్రి పవర్ ప్లాంట్ ను జనవరి 15కల్లా జాతికి అంకితం చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. 4వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ అంటేనే కరెంట్ అని.. కరెంట్ అంటేనే.. కాంగ్రెస్ అని అన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణంలో భూమి కోల్పోయిన 500 మంది నిర్వాసితులకు ప్రజా భవన్​లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డితో కలిసి శుక్రవారం ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడారు. 

గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు హైడల్, థర్మల్, సోలార్, విండ్ పవర్ ప్రాజెక్టులను విజయవంతంగా నిర్మించాయి. 1978లో జపాన్ నుంచి యంత్రాలు తెప్పించి పంప్డ్ స్టోరేజ్ టెక్నాలజీ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసినం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన భద్రాద్రి పవర్ యూనిట్ సబ్‌‌‌‌ క్రిటికల్ టెక్నాలజీతో రాష్ట్రానికి భారంగా మారింది. రాష్ట్రంలో 29 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు, 51 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఫ్రీ విద్యుత్ సప్లై చేస్తున్నాం. దీని కోసం ఏటా రూ.17వేల కోట్లు ఖర్చు అవుతున్నాయి. గ్రీన్ పవర్ ఉత్పత్తి కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతాం. యాదాద్రి పవర్ ప్లాంట్ పరిసర ప్రాంతాల్లో సీఎస్​ఆర్ నిధులతో ప్రపంచ స్థాయి విద్య, కార్పొరేట్ స్థాయి వైద్య సౌకర్యాలను ఫ్రీగా అందిస్తాం’’అని భట్టి అన్నారు. మండలానికో అంబులెన్స్, సీసీ రోడ్లు, ఫ్లై ఓవర్ల నిర్మాణం, రహదారుల కోసం భూ సేకరణకు నిధులు మంజూరు చేశామని వెల్లడించారు.

నిర్వాసితులందరికీ ఉద్యోగాలు ఇస్తాం

సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో నిర్వాసితులందరికీ ఉద్యోగాలివ్వాలని నిర్ణయించుకున్నట్లు భట్టి తెలిపారు. ‘‘ఆర్‌‌‌‌వోఎఫ్‌‌‌‌ఆర్ పట్టాల లబ్ధిదారులకు సైతం భూ నిర్వాసితులుగా ఉద్యోగాలు కల్పించాం. ఈ నియామకాలతో ఆయా కుటుంబాలు ఆర్థిక, సామాజికంగా అభివృద్ధి చెందుతాయి. భూ నిర్వాసితులకు ఉద్యోగాల కోసం కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్‌‌‌‌ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంతో పోరాడారు. జెన్‌‌‌‌కోలో విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయిన 159 మంది ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామక ఉత్తర్వులు జారీ చేస్తున్నం. 

గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లలో ఒకసారి మాత్రమే కారుణ్య నియామకాలు చేపట్టింది’’అని భట్టి ఫైర్ అయ్యారు. 2022, అక్టోబర్‌‌‌‌లో పర్యావరణ అనుమతులపై ఎన్జీటీ స్టే ఇవ్వగా, అప్పటి బీఆర్​ఎస్  ప్రభుత్వం రెండేండ్లు యాదాద్రి పవర్ ప్లాంట్ గురించి పట్టించుకోలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పనులు స్పీడప్ చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎనర్జీ సెక్రటరీ నవీన్ మిట్టల్, జెన్​కో సీఎండీ హరీశ్ ​ తదితరులు పాల్గొన్నారు.