- రాష్ట్రం సేకరించిన ధాన్యాన్ని కేంద్రం తీసుకోవాలని డిమాండ్
- వరిగడ్డిని కాల్చకుండా బయో గ్యాస్ ప్లాంట్‌లకు అందించాలని రైతులకు సూచన
- ఆధునిక పద్ధతులతోనే వ్యవసాయం పండుగలా మారుతుందని వెల్లడి
- గంభీరావుపేటలో కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన
- పాల్గొన్న మంత్రులు శ్రీధర్ బాబు, తుమ్మల, పొన్నం
రాజన్నసిరిసిల్ల, వెలుగు: ‘ఆంధ్రప్రదేశ్ లోని పోలవరం ప్రాజెక్ట్ కు జాతీయ హోదా ఇచ్చిన కేంద్ర సర్కార్ తెలంగాణలోనూ ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్ట్ కు జాతీయ హోదా కల్పించాలని ప్రధాని మోదీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో బయోస్ట్రాటమ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్ నిర్మాణానికి మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వర్ రావు, పొన్నం ప్రభాకర్ తో కలిసి శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు.
రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తెలంగాణలో కనీసం ఒక ప్రధాన సాగునీటి ప్రాజెక్టుకైనా జాతీయ హోదా ఇవ్వాల్సి ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిన కేంద్రం, తెలంగాణలోని ఏ ప్రాజెక్టుకూ ఇప్పటివరకు ఆ హోదా కల్పించలేదని విమర్శించారు. ఈ నెల 10న తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ ప్రాణహిత ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించేలా బీజేపీ మంత్రులు, ఎంపీలు చొరవ చూపాలి’అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.
రూ.30 కోట్లతో సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి నియోజకవర్గాల్లో నిర్మించనున్న 11 విద్యుత్ సబ్‌స్టేషన్లకు కూడా భూమిపూజ చేశారు. గంభీరావుపేటలో జరిగిన కార్యక్రమంలో భట్టి మాట్లాడుతూ రైతులు పండించిన పంటలను కేంద్రం నిర్ణయించిన కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) ప్రకారం కొనుగోలు చేస్తోందని, రాష్ట్రం సేకరించిన ధాన్యాన్ని కేంద్రం పూర్తిగా తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
కోతల అనంతరం పొలాల్లో వరిగడ్డిని కాల్చివేయడం వల్ల వాతావరణ కాలుష్యం పెరుగుతుందని, గడ్డిని కాల్చకుండా బయోగ్యాస్ ప్లాంట్లకు అందిస్తే రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందని చెప్పారు. ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారానే వ్యవసాయం లాభదాయకంగా మారుతుందని, వరితో పాటు పండ్ల తోటలు, చిరుధాన్యాలు, ఆయిల్ పామ్ వంటి పంటలను కూడా సాగు చేయాలని రైతులకు సూచించారు.
బయోగ్యాస్ ద్వారా యువతకు ఉపాధి
బయోగ్యాస్ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. యుద్ధం నేపథ్యంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరుగుతున్నాయని, ఈ పరిస్థితుల్లో బయోగ్యాస్ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాల అవసరం అన్నారు. మిడ్ మానేరు ప్రాజెక్ట్ ను కాంగ్రెస్ మొదలుపెట్టిందని, గత ప్రభుత్వం మిడ్ మానేరు నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వలేదన్నారు.
తిరిగి తాము వచ్చిన తర్వాతే వారికి నష్టపరిహారం అందజేశామన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు శ్రీధర్ బాబు, తుమ్మల, పొన్నం, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్యెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ వివిధ అంశాలపై రివ్యూ చేశారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేయవద్దని, వేములవాడ ఆలయ పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మృత్యుంజయం, కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బి, గీతే, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగులసత్యనారాయణ, సర్పంచ్ మల్లుగారి పద్మ తదితరులు పాల్గొన్నారు.
