జీఎస్టీ రేట్ల తగ్గింపుతో తెలంగాణకు 7 వేల కోట్ల నష్టం: భట్టి విక్రమార్క

జీఎస్టీ రేట్ల తగ్గింపుతో తెలంగాణకు 7 వేల కోట్ల నష్టం: భట్టి విక్రమార్క
  • రాష్ట్రాల ఆదాయానికి కేంద్రం భద్రత కల్పించాలి
  • జీఎస్టీ రేట్లపై సంప్రదింపుల సమావేశానికి హాజరైన డిప్యూటీ సీఎం 
  • జీఎస్టీ కౌన్సిల్​లో సందేహాలు, సమస్యలను లేవనెత్తుతాం
  • రాష్ట్రంలో వరద నష్టం రిపోర్ట్​ను కేంద్రానికి పంపుతామని వెల్లడి 

న్యూఢిల్లీ, వెలుగు: జీఎస్టీ రేట్ల తగ్గింపుతో తెలంగాణకు రూ.7 వేల కోట్ల నష్టం వాటిల్లే అవకాశం ఉందని డిప్యూటీ సీఎం, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. రేట్ల రేషనలైజేషన్​ సమయంలో రాష్ట్రాల ఆదాయానికి భద్రత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. శుక్రవారం ఢిల్లీలోని కర్నాటక భవన్​లో ఆ రాష్ట్ర ప్రభుత్వం జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణపై వివిధ రాష్ట్రాలతో సంప్రదింపుల సమావేశాన్ని నిర్వహించింది. 

సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కర్నాటక రెవెన్యూ మంత్రి కృష్ణ బైరెగౌడ, హిమాచల్ ప్రదేశ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ మంత్రి రాజేష్ ధర్మాని, కేరళ ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్, పంజాబ్ ఆర్థిక మంత్రి హర్పాల్ సింగ్ చీమా, జార్ఖండ్ ఆర్థిక మంత్రి రాధా కృష్ణ కిషోర్, తమిళనాడు ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు, పశ్చిమ బెంగాల్ రెసిడెంట్ కమిషనర్ ఉజ్జయిని దత్తా హాజరయ్యారు. రాష్ట్రాలకు నష్టపరిహారం చెల్లించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సమావేశంలో తీర్మానించారు. 

రాష్ట్ర ఆదాయంలో సంక్షేమానికి 80% పైనే..  

తెలంగాణ ఆదాయంలో 80 శాతం కంటే ఎక్కువ నిధులు సంక్షేమ వ్యయం కోసమే కేటాయిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతిపాదిత రేట్ల హేతుబద్ధీకరణ కారణంగా రాష్ట్రం దాదాపు రూ.7,000 కోట్లు నష్టపోతుందని, ఇది జీఎస్టీ ఆదాయంలో 15 శాతమని తెలిపారు. మొత్తం 15 కీలక అంశాలను ఆయన ప్రస్తావించారు. విలాస వస్తువులపై సెస్ వాటా రాష్ట్రానికి వచ్చే జీఎస్టీలో 15 శాతం మాత్రమేనని స్పష్టం చేశారు. తెలంగాణ జీఎస్టీ, జీఎస్ డీపీ నిష్పత్తి 2022–23లో 3.07 శాతం నుంచి 2024–25లో 2.58 శాతానికి క్రమంగా తగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. 

రేట్ల హేతుబద్ధీకరణ దీనిని మరింత తగ్గిస్తుందని వివరించారు. రాష్ట్రాలకు పన్ను విధించడంలో స్వేచ్ఛ లేనప్పుడు, అంతరాన్ని తగ్గించడానికి అదనపు ఆదాయానికి తగిన విధానాన్ని ప్రవేశపెట్టకపోతే ఆర్థిక భారం భారీగా ఉంటుందన్నారు. రేట్ల హేతుబద్ధీకరణకు తెలంగాణ మద్దతు ఇస్తుందని, కానీ రెండు తీవ్రమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మొదటిది.. రాష్ట్రాల ఆదాయాలను రక్షించాలని, రాష్ట్రాలు సంక్షేమం, అభివృద్ధి, మౌలిక సదుపాయాల కార్యక్రమాలను కొనసాగించేలా తగిన పరిహార విధానాన్ని రూపొందించాలని చెప్పారు. రెండోది.. పన్ను తగ్గింపు లేదా మినహాయింపు నిజంగా సమాజంలోని పేద, మధ్య తరగతి వర్గాల సమూహాలకు చేరేలా ఉండాలని అభిప్రాయపడ్డారు.  

కేంద్రం ప్రకటన ఏకపక్షం.. 

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న రేట్ల హేతుబద్ధీకరణకు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని, అయితే సంక్షేమ పథకాలపై ప్రతికూల ప్రభావం చూపే నష్టం గురించి ఆందోళన కలుగుతోందని తెలిపారు. పార్లwvwమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రతి రాష్ట్రం ముఖ్యమైనదేనని, సహకార సమాఖ్యవాద స్ఫూర్తితో, కేంద్రం నేరుగా లేదా కౌన్సిల్ ద్వారా రాష్ట్రాలను సంప్రదించి ఉండేదని, కానీ.. దురదృష్టవశాత్తు రేటు హేతుబద్ధీకరణ ప్రకటన ఏకపక్షంగా జరిగిందన్నారు. రాష్ట్రాలకు ఆదాయం తగ్గుతుంది కాబట్టి పరిహారం చెల్లిస్తామని జీఎస్టీ విధానాన్ని ప్రవేశపెట్టారని.. గత ఐదేళ్లలో జీఎస్టీ ద్వారా ఆదాయాలు గణనీయంగా పెరుగుతాయని అంచనా వేసినా ఆశించినంతగా ఏమీ జరగలేదన్నారు. 

తెలంగాణ ఆర్థిక స్వేచ్ఛతో వ్యాట్‌ను కొనసాగించి ఉంటే 2024-–25 సంవత్సరానికి ఆదాయం రూ.69,373 కోట్లు ఉండేదని, కానీ జీఎస్టీ ద్వారా ఆదాయం రూ.42,443 కోట్లు మాత్రమే వచ్చిందని తెలిపారు. రాష్ట్ర సొంత పన్ను ఆదాయంలో జీఎస్టీ వసూళ్లు 39 శాతమేనని, అందువల్ల జీఎస్టీ రేట్లలో ఏమైనా తగ్గింపులు ఉంటే.. కేంద్ర ప్రభుత్వం కంటే రాష్ట్ర ఆదాయంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని పేర్కొన్నారు. 

వరద నష్టం నివేదిక అందిస్తం.. 

తెలంగాణలో భారీ వర్షాలు, వరదల వల్ల తీవ్ర నష్టం వాటిల్లిందని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారని చెప్పారు. ఈ వరద నష్టంపై వీలైనంత తర్వరగా రిపోర్ట్ సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తామన్నారు. ఆ రిపోర్ట్ ఆధారంగా ఆర్థికసాయాన్ని కోరుతామన్నారు. మీటింగ్ అనంతరం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. ‘‘సెప్టెంబర్ 3వ తేదీన తమిళనాడు భవన్‌లో ఇదే అంశంపై బ్రేక్‌ఫాస్ట్ సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. 

అక్కడ కూడా కీలక అంశాలపై చర్చించి.. కేంద్రానికి నివేదిస్తాం. త్వరలోనే జరగబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ అన్ని అంశాలను లేవనెత్తుతాం. కేంద్ర నిర్ణయంతో చాలా రాష్ట్రాలు ఆర్థికంగా నష్టపోతున్నాయి. అందులో.. ఎన్డీయే పాలిత రాష్ట్రాలు కూడా ఉన్నాయి. అందుకే జీఎస్టీ హేతుబద్ధీకరణ అంశంపై కేంద్రం మరింత లోతుగా ఆలోచించి, సరైన నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం’’ అని తెలిపారు.