అడవి బిడ్డల జీవితాల్లో కొత్త వెలుగులు..అమ్రాబాద్ పునరావాసానికి ముందడుగు

అడవి బిడ్డల జీవితాల్లో కొత్త వెలుగులు..అమ్రాబాద్ పునరావాసానికి ముందడుగు
  •     ఒక్కో కుటుంబానికి రూ.15 లక్షల నగదు.. లేదా 5 ఎకరాల భూమి, ఇల్లు
  •     తొలి విడతలో 417 కుటుంబాలకు అందజేస్తామన్న ప్రభుత్వం
  •     14 మందికి చెక్కులు పంపిణీ చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్, వెలుగు: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అడవుల్లో శతాబ్దాలుగా ప్రకృతితో మమేకమై జీవిస్తున్న గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. వన్యప్రాణుల సంరక్షణతోపాటు గిరిజన కుటుంబాల సామాజిక, ఆర్థికాభివృద్ధిని కాంక్షిస్తూ చేపట్టిన పునరావాస ప్రక్రియలో భాగంగా బుధవారం అసెంబ్లీ కౌన్సిల్ హాల్‌‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు సమక్షంలో 14 గిరిజన కుటుంబాలకు రూ. 15 లక్షల చొప్పున పరిహారం చెక్కులు పంపిణీ చేశారు. 

ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. గిరిజనుల జీవితాల్లో అభివృద్ధి వెలుగులు నింపడం ప్రభుత్వ బాధ్యత అని.. అదే సమయంలో అటవీ, వన్యప్రాణి సంరక్షణకు సమాన ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు. గిరిజన కుటుంబాలకు పునరావాసం కల్పించడం ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని, పులులు సహా వన్యప్రాణులకు సహజ ఆవాసాలు తిరిగి లభిస్తాయన్నారు. ఈ ప్రక్రియ పూర్తిగా గిరిజనుల ఇష్టప్రకారం జరుగుతోందని, వారి ఎంపిక మేరకు రెండు విధాలుగా సహాయం అందిస్తున్నట్లు చెప్పారు. 

160 కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.15 లక్షల నగదు పరిహారం, 257 కుటుంబాలకు నాగర్‌‌ కర్నూల్ జిల్లా బచారం వద్ద ఆధునిక గృహ వసతితో పాటు ఐదెకరాల వ్యవసాయ భూమి ఇస్తున్నట్లు తెలిపారు. సార్లపల్లి, కుడిచింతలబైలు, తాటిగుండాలపెంట, కొల్లంపెంట గ్రామాలకు చెందిన కుటుంబాల అభివృద్ధికి మొత్తం రూ.62.55 కోట్లు కేటాయించామని, ఇందులో రూ.24 కోట్లు నగదు పరిహారం కోసం, రూ.38.55 కోట్లు గృహ వసతి కోసం వినియోగిస్తున్నామని స్పష్టం చేశారు. 

ఇది ఇండ్ల మార్పిడి కాదు..  జీవన మార్పిడి 

ఇది కేవలం ఇండ్ల మార్పిడి కాదని, జీవన మార్పిడి అని భట్టి అన్నారు. పునరావాసం తర్వాత గిరిజన కుటుంబాలకు పక్కా ఇండ్లు, తాగునీరు, విద్యుత్, ఆరోగ్య సేవలు అందించడమే కాకుండా, ప్రతి కుటుంబానికి వ్యవసాయ భూమి కూడా కల్పించనున్నట్లు తెలిపారు. గిరిజన పిల్లలకు ఆధునిక స్కూళ్లు, అంగన్‌‌వాడీలు, డిజిటల్ లెర్నింగ్ సదుపాయాలు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. స్వయం సహాయక సంఘాలు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ద్వారా వారి ఆర్థిక స్వావలంబనను బలోపేతం చేస్తామని తెలిపారు. 

నగదు పరిహారం కింద ఇచ్చే రూ.15 లక్షలు దేశంలోనే అత్యధిక పరిహారాల్లో ఒకటిగా నిలుస్తుందన్నారు. ఈ నిర్ణయం ద్వారా సుమారు 1,501 హెక్టార్ల అటవీ భూమి పునరుద్ధరించడం ద్వారా పులులు సహా వన్యప్రాణులు స్వేచ్ఛగా సంచరించే పరిస్థితులు ఏర్పడతాయన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చిక్కుడు వంశీకృష్ణ, రాజేశ్ రెడ్డి, పీసీసీఎఫ్​ సువర్ణ, పీసీసీఎఫ్(వైల్డ్ లైఫ్) వినయ్ కుమార్, సీసీఎఫ్(కంపా) క్షితిజ, సీఎఫ్ సునీల్ హిరామత్, నాగర్ కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతోష్, డీఎఫ్ఓ రేవంత్ చంద్ర, అధికారులు పాల్గొన్నారు.

కుటుంబంలో పెద్దనే యూనిట్ గా పరిగణిస్తాం

కుటుంబంలో ఒకరికే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా స్కీమ్ వర్తిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. కుటుంబ పెద్దకే ఈ అవకాశం ఉంటుందని, కుటుంబ పెద్దను యూనిట్ గా పరిగణిస్తామన్నారు. బుధవారం అసెంబ్లీ లాబీల్లో మీడియాతో భట్టి చిట్ చాట్ చేశారు. రేషన్ కార్డులు, సీపెక్ సర్వే డేటా ప్రకారం ప్రతి కుటుంబానికి ఈ స్కీమ్ వర్తిస్తుందన్నారు. 

రైతు బీమా స్కీమ్ అమలవుతుందా? రద్దవుతుందా? అని మీడియా ప్రశ్నించగా స్పందించడానికి నిరాకరించారు. కాంగ్రెస్ కు మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా చేశారన్న ప్రశ్నకు స్పందిస్తూ ఆ సమాచారం తనకు తెలియదన్నారు. బడ్జెట్ వినాలని ప్రతిపక్షానికి  లేదని, అందుకే బయట స్పీచ్ పేపర్లు చింపి చెవుల్లో పూలు పెట్టుకొని నిరసన తెలిపారని ఫైర్ ​అయ్యారు. రాష్ట్రంలో ప్రతి వ్యక్తికి అభివృద్ధి ఫలాలు అందుతున్నాయన్న భట్టి.. ఎలాంటి స్కీమ్ లు అమలు చేయొద్దని ప్రతిపక్షాలు భావిస్తున్నారని ఎద్దేవా చేశారు.