
మధిర, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ను రాష్ట్ర ప్రజలు ఆశీర్వదిస్తారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. సోమవారం ఖమ్మం జిల్లా మధిరలోని క్యాంప్ ఆఫీస్లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలు పదేండ్లలో రాష్ట్రంలో ఆర్థిక, పాలన వ్యవస్థలను విధ్వంసం చేశారని, వాటిని ప్రణాళిక ప్రకారం సరి చేసుకుంటూ ప్రజా ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పారు.
రాష్ట్రంలోని రైతులు, మహిళలు, యువత కోసం ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల ప్రశంసలు అందుకుంటున్నాయని తెలిపారు. బీసీలకు సామాజిక న్యాయం అందించాలనే తపనతో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని చెప్పారు.
ప్రజల కోసం నిలబడిన కాంగ్రెస్ ను కనుమరుగు చేయాలని కుట్రపూరితంగా బీఆర్ఎస్ నేతలు కోర్టులకు పంపిస్తున్నారని విమర్శించారు. ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడెకరాల భూమి వంటి హామీలు అమలు చేయలేదని గుర్తు చేశారు. రుణమాఫీని పదేండ్లలో పూర్తి చేయలేకపోయారని విమర్శించారు.
లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం కుంగిపోయిందని చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో 99 శాతం నెరవేర్చిందని తెలిపారు. అన్నివర్గాల ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరారు.