
- వంద మంది కేసీఆర్లు అడ్డం పడ్డా రాష్ట్ర ప్రగతి ఆగదు: డిప్యూటీ సీఎం భట్టి
- ప్రజలు బాగుపడుతుంటే కేసీఆర్కు దుఃఖం వస్తున్నది
- ఉద్యోగులకు రూ.10 వేల కోట్లు బకాయి పెట్టిపోతే మేం 8 వేల కోట్లు క్లియర్ చేశాం
- ఇతర రాష్ట్రాలకు విద్యుత్ అమ్మేస్థాయికి తెలంగాణ ఎదుగుతుందని ధీమా
- నాగర్‌కర్నూల్ జిల్లా గట్టు తుమ్మెన్లో 2 కొత్త సబ్స్టేషన్ల ప్రారంభోత్సవం
- మరో 5 సబ్ స్టేషన్లకు శంకుస్థాపనలు
అచ్చంపేట, వెలుగు: ‘‘కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని ఆయన కూతురు కవిత ఇప్పుడు అంటున్నది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలు 2023లోనే గుర్తించి ఎన్నికల్లో ఆ దయ్యాలను వదిలించుకున్నారు. ఆ దయ్యాలకు నాయకత్వం వహించిన కేసీఆర్ దేవుడెట్ల అయ్యిండో చెప్పాలి’’ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రశ్నించారు. బీఆర్ఎస్ దయ్యాలను తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల అవతలికి తరిమికొట్టే సమయం వచ్చిందన్నారు. సోమవారం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని గట్టు తుమ్మెన్ గ్రామంలో రెండు కొత్త సబ్స్టేషన్లను భట్టి ప్రారంభించారు.
మరో ఐదు సబ్ స్టేషన్లకు శంకుస్థాపన చేశారు. రైతులకు 150 ట్రాన్స్ఫార్మర్లు పంపిణీ చేశారు. అనంతరం గట్టుతుమ్మెన్‌లో జరిగిన సభలో డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడారు. పదేండ్లలో ఉద్యోగులకు కేసీఆర్ రూ.10 వేల కోట్లు బకాయి పెడితే తాము రాగానే రూ. 8 వేల కోట్లు క్లియర్ చేశామని తెలిపారు. రాష్ట్రంలో 90 శాతం మంది ఇండ్లకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని, ఈ వేసవిలో రికార్డు స్థాయిలో 17,162 మెగావాట్ల విద్యుత్తు డిమాండ్ వచ్చినా ఒక్క నిమిషం కూడా అంతరాయం లేకుండా సప్లై చేశామని చెప్పారు.
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మిగులు విద్యుత్ రాష్ట్రంగా తయారు చేస్తామని, ఇతర రాష్ట్రాలకు విద్యుత్‌ను అమ్మే స్థాయికి ఎదుగుతామని భట్టి చెప్పారు. రాబోయే రోజుల్లో కరెంట్వినియోగం పెరగనున్నందున మరో 50 ఏండ్ల డిమాండ్ ఆధారంగా 2029–-30 నాటికి 20 వేల మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి చేస్తామన్నారు. ‘‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కరెంటు ఉండదని కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు అసెంబ్లీలో ప్రకటిస్తే సీఎల్పీ లీడర్‌గా నేను కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టిన ప్రాజెక్టులు తప్ప కేసీఆర్ చేసిందేమిలేదని చాలెంజ్ చేశాను” అని పేర్కొన్నారు.
కేసీఆర్కు దుఃఖం ఎందుకో ?
‘‘16 నెలలు ఫామ్‌హౌస్‌లో పడుకున్న కేసీఆర్ మీటింగ్‌పెట్టి దుఃఖం వస్తున్నదని అంటున్నడు. ఎందుకు దుఃఖమొస్తుంది?” అని భట్టి విక్రమార్క నిలదీశారు. రాష్ట్ర ప్రజలు బాగుపడుతున్నందుకు కేసీఆర్కు దుఃఖమొస్తున్నదా? దగ్గరికి ఎవరొస్తలేరని బాధ కలుగుతున్నదా? అని ప్రశ్నించారు. పదేండ్లు రాష్ట్రాన్ని లూటీ చేశారని, తాము కష్టపడి రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామని తెలిపారు. 100 మంది కేసీఆర్లు అడ్డం పడినా తెలంగాణ ప్రగతి ఆగదని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో రూ. లక్ష రుణమాఫీని పదేండ్లు వాయిదాల పద్ధతిన ఇచ్చారని, అది బ్యాంకు వడ్డీలకే సరిపోయిందన్నారు.
తాము ఒకేసారి రూ.22 వేల కోట్ల రుణమాఫీ చేశామని తెలిపారు. తమ ప్రతి పథకం దేశానికి రోల్ మోడల్‌గా నిలుస్తున్నదని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 57 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, మరో 30 వేఉద్యోగాలు ప్రాసెస్‌లో ఉన్నాయని తెలిపారు. ఉద్యోగాలు రాని యువత కోసం రూ. 9వేల కోట్లతో రాజీవ్ యువ వికాసం పథకాన్ని తీసుకొచ్చామని ఆయన పేర్కొన్నారు.
అచ్చంపేటలో రూ.12,600 కోట్లతో నల్లమల డిక్లరేషన్ ప్రకటించామని, దేశంలో ఎవరూ ఇటువంటి ఆలోచన చేయలేదని అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాలిచ్చిన 6.70 లక్షల ఎకరాలకు ఇందిరా సౌర గిరి జల వికాసం పథకాన్ని అమలు చేస్తున్నామని, అడవిబిడ్డలు ఆత్మగౌరవంతో బతికేలా పండ్లతోటలను ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు. తెలంగాణలో ఎందుకు పుట్టలేదని ఇతర రాష్ట్రాల ప్రజలు బాధపడేలా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామన్నారు.
ఆర్థిక భారం ఉన్నప్పటికీ 29 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు 24 గంటల ఉచిత విద్యుత్ఇస్తున్నామని చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు రూ. 12,500 కోట్లు చెల్లిస్తుందన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులను పూర్తి చేస్తామని, రంగారెడ్డి ఎత్తిపోతలపై ప్రత్యేక దృష్టి పెడతామని తెలిపారు. అచ్చంపేట నియోజకవర్గం లో 45వేల పంపుసెట్ల కు సోలార్ పవర్ ఏర్పాటు చేయడంపై స్టడీ చేస్తున్నట్టు తెలిపారు. సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, మధుసూదన్ రెడ్డి, మేఘరెడ్డి, ట్రాన్స్‌కో, ఎస్పీడీసీఎల్ సీఎండిలు కృష్ణ ఆదిత్య, ముషారఫ్, కలెక్టర్ బాదావత్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.