
- బీఆర్ఎస్ నాయకులపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫైర్
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ నేతలు ప్రాజెక్టుల రీ డిజైన్ పేరుతో రూ.1.45 లక్షల కోట్లు ఖర్చు చేసినా ఒక్క ఎకరాకూ అదనంగా నీళ్లు ఇవ్వలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఒక్క కాళేశ్వరంపై ప్రాజెక్టుపైనే రూ.లక్ష కోట్లు తిని, నీళ్లు మాత్రం ఇవ్వలేదని మండిపడ్డారు. గోదావరి నదిపై ఇచ్చంపల్లి, తుమ్మిడిహెట్టి, తుపాకులగూడెం, ఇందిరా రాజీవ్ సాగర్ వంటి ప్రాజెక్టులను కేవలం రూ.42 వేల కోట్లు ఖర్చుపెడితే.. 24 లక్షల ఎకరాలకు సాగు నీళ్లు అందేవన్నారు. బుధవారం ప్రజా భవన్‌లో కాళేశ్వరం, కృష్ణా నీళ్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా ఆయన మాట్లాడారు.
కృష్ణా నదిపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రాజెక్టులు బీఆర్ఎస్ పూర్తి చేస్తే కృష్ణా జలాల సమస్య వచ్చేదే కాదన్నారు. కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్2 నీటి కేటాయింపులు చేస్తున్నందున ముందుచూపుతో.. 2004లోనే కృష్ణా నదిపై నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులను ప్రారంభించిందని గుర్తుచేశారు. కానీ, పెండింగ్‌లో పడిన ప్రాజెక్టులను రాష్ట్రం వచ్చాక బీఆర్‌ఎస్ ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. ఇప్పుడు ఆ నష్టాన్ని పూడ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని వివరించారు. గోదావరిపై ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి ఉంటే బనకచర్ల సమస్య వచ్చేది కాదన్నారు.