
- మాది గడీల పాలన కాదు.. ప్రజా పాలన
- మూసీ నిర్వాసితులకు అన్యాయం చేయబోమని వెల్లడి
- ఖమ్మం కలెక్టరేట్లో విద్యుత్ శాఖపై డిప్యూటీ సీఎం రివ్యూ
ఖమ్మం, వెలుగు: విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి రెండు నెలల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. పదేండ్లుగా పెండింగ్ లో ఉన్న పదోన్నతులను తామే క్లియర్ చేశామని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల విద్యుత్ శాఖ అధికారుల పనితీరుపై మంగళవారం ఖమ్మం కలెక్టరేట్లో రివ్యూ నిర్వహించారు. తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల్లో అభివృద్ధి పథకాలు, వరద సహాయక చర్యలపై చర్చించారు. తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘రెవెన్యూ రికార్డుల అప్డేషన్ పేరుతో గత పాలకులు బినామీల పేరిట భూములు బదలాయించారు. ఆక్రమణకు గురైన చెరువులను మేము ప్రజలకు ఇవ్వాలనుకుంటున్నం. కేబినెట్లో చర్చించిన తర్వాతే మూసీ ప్రాజెక్టుపై ముందుకెళ్తున్నం. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డికి ఒకటే చెప్పాలనుకుంటున్న.. మీ హయాంలో కేసీఆర్ ఒక్కడే నిర్ణయాలు తీసుకునేవాడు. కానీ.. మాది ప్రజాస్వామ్య ప్రభుత్వం. కేబినెట్లో చర్చించాకే ముందుకెళ్తం. మూసీ నదిలో మంచి నీళ్లు పారించి సుందరీకరిస్తం. మూసీ నిర్వాసితులకు అన్యాయం చేయం. బీఆర్ఎస్ మాదిరి మాది గడీల పాలన కాదు.. ప్రజా పాలన. మూసీని సుందరీకరిస్తామని పదేండ్లు మాయమాటలు చెప్పిన్రు. మేము ఆచరణలో పెడ్తున్నం. డీపీఆర్‌లే సిద్ధం కాలేదు.. లక్షా యాభైవేల కోట్లు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నరు’’అని భట్టి మండిపడ్డారు.
11న రాష్ట్రవ్యాప్తంగా భూమి పూజలు
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో ఏండ్లుగా స్టూడెంట్లకు మెస్ బిల్లులు చెల్లించలేదని భట్టి అన్నారు. ‘‘కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యా సంస్థల పెండింగ్ బిల్లుల కోసం రూ.114 కోట్లు రిలీజ్ చేశాం. కాస్మోటిక్ చార్జీలు కూడా గత బీఆర్ఎస్ సర్కార్ పెండింగ్‌లో పెట్టింది. మేము ప్రతి నెలా క్లియర్ చేస్తున్నాం. మిషన్ భగీరథలోని ఔట్ సోర్సింగ్ సిబ్బంది, జీపీలోని స్వీపర్లు, మధ్యాహ్న భోజన ఏజెన్సీల వేతనాలు ప్రతి నెలా చెల్లించేలా వ్యవస్థను తీసుకొస్తున్నం. జిల్లా స్థాయి అధికారులు 15 రోజులకోసారి వెల్ఫేర్ హాస్టల్స్‌లో రాత్రి బస చేయాలి. త్వరలో మేము కూడా హాస్టల్స్‌ను తనిఖీ చేస్తాం.
అన్ని రకాల వసతులతో రూ.5వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణాలు ప్రారంభిస్తున్నం. ఈ నెల 11న రాష్ట్ర వ్యాప్తంగా భూమి పూజలు చేస్తం’’అని భట్టి తెలిపారు. విద్యుత్ వినియోగం పెరుగుతున్నదని, అవసరమైన ట్రాన్స్ఫార్మర్లు, లైన్లు, పోల్స్ అప్టేడ్ చేసుకోవాలని అధికారులకు సూచించారు. కరెంట్‌కు సంబంధించి ఏ సమస్య ఉన్నా టోల్ ఫ్రీ నంబర్ 1912కు కాల్ చేయాలన్నారు. 2029–30 నాటికి 20 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని తెలిపారు. గృహజ్యోతి పథకం కింద ఉమ్మడి ఖమ్మం సర్కిల్ పరిధిలో ఇప్పటి వరకు 26 లక్షల వినియోగదారులకు లబ్ధి చేకూరిందన్నారు.