
- ప్రజలకు అవగాహన కల్పించి మాక్ డ్రిల్ చేపట్టాలి: భట్టి
- జిల్లా కేంద్రాల్లోనూ సంఘీభావ ర్యాలీలు నిర్వహించాలి
- హైలెవెల్ కమిటీ మీటింగ్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
హైదరాబాద్, వెలుగు: దేశంలో యుద్ధ వాతావరణం నెలకొన్నందున ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు పోలీస్ శాఖ సమగ్ర యాక్షన్ ప్లాన్ రూపొందించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆదేశించారు. శుక్రవారం సెక్రటేరియెట్‌లో డిప్యూటీ సీఎం అధ్యక్షతన హై లెవెల్ కమిటీ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి, రాచకొండ సీపీ సుధీర్ బాబు తదితరులు పాల్గొన్నారు.
ప్రజల్లో జాతీయవాద భావన పెంపొందించేందుకు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో అన్ని వర్గాల ప్రజలతో సంఘీభావ ర్యాలీలు నిర్వహించాలని సీఎస్‌ను డిప్యూటీ సీఎం ఆదేశించారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లో నిర్వహించిన సంఘీభావ ర్యాలీ సమాజానికి సానుకూల సందేశాన్ని అందించిందన్నారు. సున్నితమైన అంశాలపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాన్ని అడ్డుకునేందుకు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలన్నారు. 24 గంటల ముందుగా ప్రజలను అప్రమత్తం చేసి సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్స్ నిర్వహించాలని సూచించారు.
ఇతర రాష్ట్రాల ప్రజల సహాయం కోసం ఢిల్లీ లోని తెలంగాణ భవన్‌లో 24/7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని, హైదరాబాద్‌లో సైరన్ అలర్ట్ వ్యవస్థ కోసం అవసరమైన పరికరాలను సమకూర్చుకోవాలని ఆదేశించారు. అత్యవసర విభాగాల ఉద్యోగుల సెలవులను రద్దు చేసి, వారు హెడ్‌క్వార్టర్స్‌లలో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. డీఆర్‌డీఓ, ఎన్‌ఎఫ్‌సీ వంటి జాతీయ సంస్థల వద్ద గట్టి బందోబస్తు, పెట్రోలింగ్, సీసీటీవీ మానిటరింగ్‌ను అమలు చేస్తున్నట్లు డీజీపీ జితేందర్ తెలిపారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మూడంచెల భద్రత, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో భద్రతను కట్టుదిట్టంచేసినట్లు పేర్కొన్నారు.
ఈ నెల 15 నుంచి 25లోగా యువ వికాసం లబ్ధిదారుల ఎంపిక
ముందుగా నిర్దేశించుకున్న ప్రకారం రాజీవ్ యువ వికాసం లబ్ధిదారులను ఎంపిక చేసి.. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 న సాంక్షన్ పత్రాలు పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని భట్టి అధికారులను ఆదేశించారు. దరఖాస్తుల వెరిఫికేషన్ స్పీడప్చేసి ఈ నెల 15 నుంచి 25 వ తేదీలోగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరగాలని సూచిం చారు.
ఈ నెల 25 నుంచి 30వ తేదీలోగా ఎంపికైన లబ్ధిదారుల సంబంధించిన సాంక్షన్ పత్రాలను సిద్ధం చేయాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులకు సాంక్షన్ పత్రా లను పంపిణీ చేయాలని దిశా నిర్దేశం చేశారు. ఇందులో ఎలాంటి జాప్యం జర గకుండా రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు.