లోన్ టార్గెట్లు పూర్తి చేయాలి: భట్టి విక్రమార్క

లోన్ టార్గెట్లు పూర్తి చేయాలి: భట్టి విక్రమార్క

హైదరాబాద్‌‌, వెలుగు:  రైతులు, నిరుద్యోగులకు ఇచ్చే లోన్ టార్గెట్లు పూర్తి చేయాలని బ్యాంకర్లను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. వారి ఆస్తులను తాకట్టు పెట్టుకోవడం సరికాదన్నారు. రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల్లో ఉన్న మహిళలను కోటీశ్వరులను చేయాలన్న సర్కార్ లక్ష్యానికి అనుగుణంగా లోన్లు ఇవ్వాలని సూచించారు. గురువారం బేగంపేటలోని ఓ ప్రైవేట్‌‌ హోటల్​లో నిర్వహించిన స్టేట్‌‌ లెవల్ బ్యాంకర్స్‌‌ కమిటీ క్వార్టర్లీ మీటింగ్‌‌కు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌‌ రావుతో క‌‌లిసి డిప్యూటీ సీఎం పాల్గొన్నారు.

ఈ సంద‌‌ర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడారు. ‘‘అర్హులకు లోన్లు ఇవ్వడం బ్యాంకర్ల సామాజిక బాధ్యత. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నది. బ్యాంకు అధికారులు కూడా సహకరించాలి. గ‌‌త బీఆర్‌‌ఎస్‌‌ పాల‌‌న‌‌లో చాలా మంది రైతుల‌‌ ఖాతాలు ఇర్రెగ్యులర్​గా మారాయి. అర్హులైన రైతులందరికీ తిరిగి రుణాలు ఇవ్వాలి. ఈ విషయంలో రైతుల పట్ల నిర్లక్ష్యం, అసహనం ప్రదర్శించొద్దు. బ్యాంకులు రుణాలు ఇవ్వకపోతే వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదం ఉంది’’అని భట్టి అన్నారు. 

మానవీయ కోణంలో ఆలోచించాలి: భట్టి

రైతుల విషయంలో అధికారులు మానవీయ కోణంలో ఆలోచించాలని భట్టి విక్రమార్క అన్నారు. వచ్చే ఐదేండ్లలో స్వయం సహాయక సంఘాల మహిళలకు రూ.లక్ష కోట్లు వడ్డీ లేకుండా లోన్లు ఇస్తాం. దీనికి బ్యాంకర్లు సహకరించాలి. వ్యవసాయం, హౌసింగ్, విద్యకు ఇచ్చే లోన్లకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వ్యాపారపరంగా నష్టపోయిన ఈము రైతులకు రుణాల చెల్లింపుల విషయంలో బ్యాంకర్లు వన్ టైమ్ సెటిల్​మెంట్ చేయాలని కోరారు. ‘‘స్వయం ఉపాధి కోసం యువతకు లోన్లు ఇవ్వాలి. సంపద సృష్టికర్తలకు బ్యాంకర్లు తోడ్పాటు ఇవ్వడంతో రాష్ట్రాభివృద్ధి జరుగుతుంది.

పెట్టుబడులకు హైదరాబాద్ అనువైన ప్రాంతం. రీజినల్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు మధ్య ప్రభుత్వం క్లస్టర్లను ఏర్పాటు చేయబోతున్నది. వీటి మధ్య పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం. నేను ఆంధ్రాబ్యాంకు డైరెక్టర్​గా పని చేశాను. ఆ టైమ్​లోనే ఎడ్యుకేషన్ లోన్లు, కిసాన్ క్రెడిట్ కార్డులు ప్రారంభం అయ్యాయి. 20 ఏండ్లు అవుతున్నా.. ఆ రుణాల జారీలో ఏ మాత్రం ప్రోగ్రెస్ లేదు’’అని తెలిపారు. 

కీలక రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలి: తుమ్మల

రుణాలిచ్చే విష‌‌యంలో వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలకు బ్యాంకులు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సూచించారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాల్లో ప్రజలకు ప్రాధాన్యత ఉన్న వాటిని గుర్తించి వాటిని ముందుకు తీసుకెళ్లడానికి బ్యాంకర్లు సహకరించాలన్నారు. ‘‘రాష్ట్రంలో డిమాండ్‌‌కు తగ్గట్టు పాల ఉత్పత్తి లేదు. పాడి పరిశ్రమ నెలకొల్పడానికి ముందుకొచ్చే రైతులకు రుణాలు ఇచ్చి ప్రోత్సహించాలి. బ్యాంకింగ్ వ్యవస్థ నిబద్ధతగా ఉండాలి. వ్యవస్థ విచ్ఛిన్నం అయితే.. సమాజం విచ్ఛినం అవుతుంది’’అని తెలిపారు. 

అగ్రికల్చర్‌‌ సెక్టార్‌‌కు రూ.87వేల కోట్ల లోన్లు ఇచ్చినం

2023–24 ఫైనాన్షియల్ ఇయర్‌‌లో అగ్రికల్చర్ సెక్టార్కు రూ.87,270 కోట్ల లోన్లు ఇచ్చినట్టు స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ  వెల్లడించింది. రైతులకు రూ.49,501 కోట్లు ఇచ్చినట్టు వివరించింది. రైతుల పంట రుణాల్లో రూ.73,438 కోట్లు టార్గెట్ పెట్టుకోగా.. 67.41 శాతం చేరుకున్నట్టు తెలిపింది. ఈ మేరకు నివేదిక విడుదల చేసింది. ఎడ్యుకేషన్ లోన్లు రూ.623.71 కోట్లు, హౌసింగ్ లోన్లు రూ.2,889.65 కోట్లు ఇచ్చినట్టు పేర్కొంది.

రంజాన్​ ఏర్పాట్లలో లోపాలు తలెత్తొద్దు

రాష్ట్రంలో రంజాన్​ ఏర్పాట్లలో లోపాలు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. నిధుల కొరత లేదని, అవసరమైన అన్ని ఏర్పాట్లకూ ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు. శుక్రవారం ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఇఫ్తార్ విందు కార్యక్రమం కోసం చేపడుతున్న ఏర్పాట్లను గురువారం సంబంధిత అధికారులతో కలిసి భట్టి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇఫ్తార్‌‌కు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నదని, అందుకే మొద‌‌టి శుక్రవారమే ఏర్పాటు చేసిందని తెలిపారు.

అన్ని శాఖలూ ప్రణాళికా బద్ధంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.  అనంతరం ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. ఇఫ్తార్ విందులో ముస్లిం సోదరులు నమాజ్ చేసేందుకు  ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.