- అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలు
- ఐటీ కారిడార్‌లో ఫ్లై ఓవర్ల కిందే సబ్‌స్టేషన్ల ఏర్పాటు
- త్వరలో 108 మాదిరిగా పవర్ అంబులెన్స్ సేవలు తీసుకొస్తామని వెల్లడి
- ఎస్పీడీసీఎల్ కార్పొరేట్ ఆఫీస్‌లో విద్యుత్ శాఖపై సమీక్ష
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు దశలవారీగా సోలార్ విద్యుత్ సదుపాయం కల్పించనున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈ మేరకు కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్‌లోని కొండాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్ వంటి ప్రాంతాల్లో భూమి కొరత దృష్ట్యా ఫ్లైఓవర్ల కింద సబ్‌స్టేషన్ల ఏర్పాటుకు మున్సిపల్ శాఖతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.
రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే 108 మాదిరిగా పవర్ అంబులెన్స్ సేవలు తీసుకొస్తామని చెప్పారు. శనివారం హైదరాబాద్‌లోని ఎస్పీడీసీఎల్ కార్పొరేట్ ఆఫీస్‌లో విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఇందన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్‌లో అభివృద్ధి చేసిన మోడల్ సబ్‌స్టేషన్‌ను ఆదర్శంగా తీసుకుని దక్షిణ డిస్కమ్ పరిధిలోని అన్ని సబ్‌స్టేషన్లను దశలవారీగా ఆధునీకరించాలని అధికారులకు సూచించారు.
అలాగే, ప్రజల్లో విద్యుత్ భద్రతపై అవగాహన కల్పించడంతో పాటు ఉద్యోగులు సైతం భద్రతా ప్రమాణాలు కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్నందున, భవిష్యత్తులో పెరిగే విద్యుత్ డిమాండ్‌ను తట్టుకునేలా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు.
ఎలాంటి పరిస్థితుల్లోనూ విద్యుత్ సరఫరాలో అంతరాయాలు రాకుండా చూడాలన్నారు. ప్రధానంగా ప్రజల తాగునీటి అవసరాలకు, రైతుల వ్యవసాయ సాగుకు ఆటంకం కలగకుండా విద్యుత్‌ను నిరంతరాయంగా అందించాలన్నారు. రాష్ట్ర భవిష్యత్ దృష్ట్యా కోయగూడెం–3, సత్తుపల్లి–3 బొగ్గు బ్లాక్‌లు సింగరేణికే దక్కాలని భట్టి ఆశించారు. గత పాలకుల అనాలోచిత నిర్ణయాలతో ఈ బ్లాక్‌లు సింగరేణికి దక్కకుండా పోయాయన్నారు. తిరిగి ఈ రెండు బ్లాక్‌లు సింగరేణికే దక్కాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఇందుకు అవసరమైన కార్యాచరణను వెంటనే ప్రారంభించాలని సింగరేణి అధికారులను ఆదేశించారు.
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన దక్షిణ డిస్కమ్ సీఎండీ పాటిల్
విద్యుత్ శాఖపై సమీక్ష సందర్భంగా ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేశ్ వి పాటిల్ పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ఇచ్చారు. గత 30 నెలలుగా డిస్కమ్ పరిధిలో చేపట్టిన సంస్కరణలు, అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి భట్టికి వివరించారు. ఫీడర్, డీటీఆర్, కస్టమర్ల మ్యాపింగ్ ద్వారా విద్యుత్ అంతరాయాలను తక్షణమే గుర్తించి ఎలా సమస్య పరిష్కరించవచ్చో తెలిపారు.
మ్యాపింగ్ ద్వారా ఫిర్యాదుల పరిష్కారం, కచ్చితమైన ఎనర్జీ ఆడిట్ నిర్వహించడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థలో ఏఐ ద్వారా పారదర్శక సేవలు అందించవచ్చని సూచించారు. సమావేశంలో ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణ భాస్కర్, సింగరేణి సీఎండీ జ్యోతి బుద్ధ ప్రకాశ్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
