వ్యర్థాల నిర్వహణలో మెరుగైన విధానాలు అమలు చేస్తున్నం : డిప్యూటి సీఎం భట్టి

వ్యర్థాల నిర్వహణలో మెరుగైన విధానాలు అమలు చేస్తున్నం : డిప్యూటి సీఎం భట్టి

 

  • క్యూర్, ప్యూర్, రేర్  పాలసీని అనుసరిస్తున్నాం
  • ‘స్వచ్ఛ భారత్  మిషన్’ సమీక్షా సమావేశంలో డిప్యూటి సీఎం భట్టి

న్యూఢిల్లీ, వెలుగు: వ్యర్థాల నిర్వహణలో తెలంగాణ రాష్ట్రం మెరుగైన విధానాలను అమలు చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన ‘తెలంగాణ విజన్–2047’ లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని భవిష్యత్తు అవసరాలకు సరిపోయేలా  కృషి చేస్తోందన్నారు. రాష్ట్ర అభివృద్ధి దిశగా క్యూర్, ప్యూర్, రేర్  విధానాన్ని అనుసరిస్తోందని చెప్పారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ‘స్వచ్ఛ భారత్ మిషన్–అర్బన్ 2.0’ రెండు రోజుల జాతీయ సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తోంది. మంగళవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో కేంద్ర మంత్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

రాష్ట్రం నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్  చీఫ్  సెక్రటరీ జయేశ్  రంజన్, సీఎం సెక్రటరీ మాణిక్ రాజ్, జీహెచ్ఎంసీ కమిషనర్  ఆర్వీ కర్ణన్‌‌తో పాటు వివిధ రాష్ట్రాల పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మొదటి రోజు సమావేశంలో దేశంలోని పట్టణ ప్రాంతాల్లో పరిశుభ్రత, పారిశుధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణ, ఇంటింటి చెత్త సేకరణ, వ్యర్థాల శాస్త్రీయ ప్రాసెసింగ్, పాత చెత్తకుప్పల తొలగింపు, వ్యర్థాల నుంచి విద్యుత్  ఉత్పత్తి, పీపీపీ విధానాలు, కొత్త ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనల అమలు వంటి అంశాలపై సమీక్షించారు. 

శాస్త్రీయ శుద్దిపై ప్రత్యేక దృష్టి...

తెలంగాణలో అమలవుతున్న వ్యర్థాల నిర్వహణ విధానాలు, సుస్థిర పట్టణాభివృద్ధి చర్యలు, స్వచ్ఛత కార్యక్రమాలు, సర్క్యులర్  ఎకానమీ దిశగా చేపడుతోన్న ప్రోగ్రాంలను డిప్యూటీ సీఎం భట్టి వివరించారు. పాత డంప్‌‌ యార్డుల శాస్త్రీయ శుద్ధిపై దృష్టి సారించామని చెప్పారు. హైదరాబాద్‌‌లోని జవహర్‌‌నగర్  డంప్ యార్డ్  విషయంలో ఐఐటీ బాంబే సాంకేతిక సహకారం  పొందుతున్నామన్నారు.  అలాగే ఆటోనగర్  డంప్ సైట్‌‌లో సుమారు 40 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న 22 లక్షల మెట్రిక్  టన్నుల వ్యర్థాలను బయోమైనింగ్  ద్వారా ప్రాసెస్  చేస్తున్నామని  తెలిపారు.

ఇప్పటివరకు దాదాపు 30 శాతం వ్యర్థాలు ప్రాసెస్  అయ్యాయని వివరించారు. స్వాధీనం చేసుకున్న భూమిని మళ్లీ డంపింగ్  కోసం కాకుండా భవిష్యత్తులో పార్కులు, క్రీడా సదుపాయాలు, ప్రజా వినియోగ మౌలిక సదుపాయాలుగా అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. డంప్  యార్డులను అభివృద్ధి కేంద్రాలుగా మార్చడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం అని నొక్కి చెప్పారు.

రాష్ట్రాలకు కేంద్రం ఆర్థిక సహకారం అందించాలి

2047 నాటికి భారత్‌‌ను 30–35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్య సాధనలో, తెలంగాణ రాష్ట్రం తన 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంతో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉందని భట్టి గుర్తుచేశారు. స్వచ్ఛ సర్వేక్షణ్  సహా జాతీయ పరిశుభ్రత, పట్టణ పారిశుధ్య ర్యాంకింగ్స్‌‌లో తెలంగాణ రాష్ట్రం నిరంతరం మెరుగైన ప్రదర్శన కనబరుస్తోందన్నారు.

జపాన్ తరహాలో మొదటి తరగతి నుంచే పాఠశాలల్లో పరిశుభ్రత, వ్యర్థాల వేర్పాటు, పర్యావరణ బాధ్యత వంటి అంశాలను ఆచరణాత్మకంగా బోధించే అంశాన్ని అన్ని రాష్ట్రాలు పరిశీలించాలని ఆయన సూచించారు. వ్యర్థాల నుంచి విద్యుత్, రీసైక్లింగ్, సర్క్యులర్ ఎకానమీ ప్రాజెక్టుల అమలుకు రాష్ట్రాలకు కేంద్రం తగిన ఆర్థిక సహకారం అందించాలని కోరారు. ఆధునిక మౌలిక సదుపాయాలు, శాస్త్రీయ ప్రాసెసింగ్  యూనిట్లు ఏర్పాటు చేసేందుకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అందించే అంశాన్ని పరిశీలించాలని కేంద్రాన్ని కోరారు.