
- విద్వేష రాజకీయాలు రాజేసేది బీజేపీయే: భట్టి
- మోదీ అర్బన్ నక్సల్స్ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం ఆగ్రహం
హైదరాబాద్, వెలుగు: ఓట్ల కోసం, సీట్ల కోసం దేశంలో మత విద్వేషాలు రాజేసేది కేవలం బీజేపీ మాత్రమే అని, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హితవు పలికారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం గొంతెత్తే వాళ్లను దేశ ద్రోహులుగా, అర్బన్ నక్సల్స్ గా చిత్రించి నిర్బంధించే పాత్రను ఆ పార్టీ పోషిస్తున్నదని శనివారం ప్రకటనలో పేర్కొన్నారు.
సుదీర్ఘమైన జాతీయోద్యమ నేపథ్యం, దేశ దాస్య శృంఖలాలు తెంచడం కోసం నిర్బంధాలకు గురైన, త్యాగాలు చేసిన చరిత్ర కాంగ్రెస్ కు మాత్రమే ఉందన్నారు. దేశ సమగ్రత, సమైఖ్యత కోసం ప్రజాస్వామిక విలువల కోసం కట్టుబడిన పార్టీ కాంగ్రెస్ అని తెలిపారు.
గాంధీ కుటుంబం దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిందని గుర్తు చేశారు. అంతటి చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని అవినీతిపరులు, విభజన వాదులు, అర్బన్ నక్సలైట్ లు అనడం ప్రధాని స్థాయికి తగ్గ మాటలు కావని హితవు పలికారు. ప్రధాని పదవిలో ఉండటం అసెంబ్లీ ఎన్నికల్లో గెలవటం కోసం ప్రతిపక్ష పార్టీపై అలాంటి విమర్శలు కరెక్ట్ కావని ఆయన మండిపడ్డారు.
కాంగ్రెస్ లో విద్వేషం లేదనీ.. దేశంలో మత రాజకీయాలు విద్వేష రాజకీయాలకు అబద్ధాలే పునాదిగా బీజేపీ పనిచేస్తున్న విషయం ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఓట్ల కోసం, సీట్ల కోసం ఆ పార్టీ దేశంలో మత విద్వేషాలు రాజేసేస్తున్నదని ఆరోపించారు.