
- కృష్ణా నదిపై ఏపీ ప్రాజెక్టులకు బీఆర్ఎస్ సహకరించింది: డిప్యూటీ సీఎం భట్టి
- శ్రీశైలం ఎగువన రోజుకు 11 టీఎంసీలు తరలించేలా ప్రాజెక్టులు నిర్మిస్తున్నా కేసీఆర్ అడ్డుకోలేదని ఫైర్
- మంత్రి పొంగులేటితో కలిసి పాలేరు రిజర్వాయర్ నుంచి నీటి విడుదల
ఖమ్మం, వెలుగు: బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. శ్రీశైలం ఎగువన రోజుకు 11 టీఎంసీలు తరలించేలా ఏపీ.. ప్రాజెక్టులు నిర్మిస్తున్నా కేసీఆర్అడ్డుకోలేదని విమర్శించారు. సోమవారం ఖమ్మం జిల్లాలోని పాలేరు రిజర్వాయర్ నుంచి రెండో జోన్‌కు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి భట్టి విక్రమార్క నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ తప్పిదాల వల్ల జూరాల, శ్రీశైలం మధ్యలో రాయలసీమ లిఫ్ట్ కట్టారని, దీనివల్ల సాగర్ ఎడమ కాలువ రెండో జోన్ పరిధిలోకి వచ్చే ఖమ్మం జిల్లాకు తీవ్ర నష్టం జరిగిందని తెలిపారు.
మొదటి జోన్‌లోని నల్గొండ జిల్లాకు కూడా ఇబ్బంది ఏర్పడిందని చెప్పారు. ఈ తప్పులను సరిచేస్తూ కృష్ణానది నుంచి వీలైనంత ఎక్కువ నీటిని దక్కించుకునేందుకు సీఎం రేవంత్‌రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రయత్నిస్తుంటే.. బీఆర్ఎస్ లీడర్లు బురదజల్లుతున్నారని ఆరోపించారు. కృష్ణా నదిపై పాలమూరు–- రంగారెడ్డి, నెట్టెంపాడు, బీమా, కోయిల్ సాగర్, నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాలను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. గత ప్రభుత్వం వరి వేస్తే ఉరి అని అంటే, తాము సన్నాలకు రూ.500 బోనస్ ఇచ్చి సాగును ప్రోత్సహిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు.
పాలేరు రిజర్వాయర్ కింద 2 లక్షల 53 వేల ఎకరాలకు నీరు విడుదల చేశామని పేర్కొన్నారు. నిరుడు భారీ వర్షాలవల్ల ఖమ్మం జిల్లాలో అనేక ప్రాంతాలు ముంపుకు గురయ్యాయని, నాగార్జునసాగర్ ప్రధాన కాలువ, యూటీలు కొట్టుకు పోయాయని, వాటిని యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించామని తెలిపారు. సోమవారం సెర్ప్ సీఈవో డి. దివ్యతో కలిసి మధిర నియోజకవర్గస్థాయి ఇందిరా మహిళా శక్తి సంబురాల్లో పాల్గొన్నారు. మహిళా సంఘాలకు లోన్లు, బీమా చెక్కులు, చింతకాని మండలానికి చెందిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.