64.75 లక్షల మంది రైతులకు .. రూ.5,575 కోట్లు ఇచ్చినం: భట్టి

64.75 లక్షల మంది రైతులకు .. రూ.5,575 కోట్లు ఇచ్చినం: భట్టి

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రైతు బంధు ఇవ్వలేదంటూ బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. 64 లక్షల 75 వేల మంది రైతులకు రూ.5,575 కోట్ల పెట్టుబడి సాయం అందిచామని చెప్పారు. 92 శాతం మంది రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేశామని లెక్కలతో సహా వివరించారు. గత ప్రభుత్వం కంటే తామే రైతు బంధు డబ్బులను రైతులకు చాలా స్పీడ్ గా వేస్తున్నామని చెప్పారు.

దీనిపై చర్చకు సిద్ధమని సవాల్‌‌‌‌ విసిరారు. శుక్రవారం హైదరాబాద్‌‌‌‌ గాంధీభవన్‌‌‌‌లో పీఈసీ సమావేశం తర్వాత భట్టి మీడియాతో మాట్లాడారు. ఒకటో తారీకు నాడే ఉద్యోగులకు జీతాలు వేస్తున్నామని చెప్పారు. మూసీ నది సుందరీకరణ, ట్రిపుల్ ఆర్ నిర్మాణానికి ప్రత్యేక చొరవ తీసుకొని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిశామని చెప్పారు. ట్రిపుల్ ఆర్ భూసేకరణ కోసం నిధులు మంజూరు చేసామని.. భూసేకరణ ప్రక్రియ మొదలవుతున్నదని తెలిపారు. కాంగ్రెస్ 100 రోజుల పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై చర్చకు సిద్ధమన్నారు. బీఆర్ఎస్ పాలకుల లెక్క తాము ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు మాత్రం చేయలేదన్నారు.

ప్రజలు ఓడించినా బుద్ధిరాలే

అడ్డగోలుగా కామెంట్లు చేయకుండా.. ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాని బీఆర్ఎస్ వర్కింగ్ ​ప్రెసిడెంట్ ​కేటీఆర్ ను.. భట్టి విక్రమార్క హెచ్చరించారు. ‘‘నువ్వు ఏం చదువుకున్నవ్.. మాట్లాడుతున్న భాష ఏంది. వెంట్రుక కూడా పీకలేరంటవా? పెద్ద చదువులు చదువుకొని మంత్రిగా కూడా పనిచేశావు కదా.. ఏం భాష మాట్లాడుతున్నవ్” అంటూ ఫైర్ అయ్యారు. దేశ భద్రతకు వాడాల్సిన ట్యాపింగ్ టెక్నాలజీని రాజకీయ, వ్యక్తిగత స్వార్థం కోసం వినియోగించి తప్పు చేయడమే కాకుండా “ఏం పీకలేరంటూ” అహంకార పూరితంగా మాట్లడడమేంటని మండిపడ్డారు. అధికారంలో ఉండి అనేక తప్పులు చేసిన మిమ్మల్ని ప్రజలు ఓడించినా బుద్ధి రాలేదన్నారు. ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలని సూచించారు. మీలా ఇంట్ల నుంచి బయటకు రాకుండా, సెక్రటేరియెట్ కు వెళ్లకుండా సోషల్ మీడియాలో మెసేజ్​ల ద్వారా తాము పాలన చేయట్లేదని ఎద్దేవా చేశారు. జనం మధ్యకు వెళ్లి జనంలో ఉండి పాలన చేస్తున్నామని చెప్పారు. 

గత సర్కార్​ నిర్లక్ష్యం వల్లే నీటి ఎద్దడి

లోక్​సభ ఎన్నికల నేపథ్యంలో ఏప్రిల్ 6 న తుక్కుగుడలోని రాజీవ్ ప్రాంగణంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని భట్టి ప్రకటించారు. ఈ సభలో పార్టీ మేనిఫెస్టోను ప్రజలకు రిలీజ్ చేస్తామని వెల్లడించారు. తెలంగాణ మోడల్ ను దేశానికి పరిచయం చేస్తామన్నారు. సభకు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ హాజరు కాబోతున్నారని పేర్కొన్నారు. మీటింగ్​కు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గత బీఆర్ఎస్ పాలకులు ప్రాజెక్టులో ఉన్న నీళ్లను  జాగ్రత్తగా వాడుకుంటే ఇప్పుడు నీటి ఎద్దడి వచ్చేది కాదన్నారు. నీటి ఎద్దడి నివారణకు ప్రతి నియోజకవర్గానికి మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశామన్నారు. మంచినీటి ఎద్దడి నివారణకు అవసరమైతే ఎలక్షన్ కమిషన్ అనుమతి తీసుకొని కార్యచరణ ప్రణాళిక అమలు చేస్తామని చెప్పారు.