హైదరాబాద్, వెలుగు: దేశంలో గ్రీన్ హైడ్రోజన్ కు చిరునామాగా తెలంగాణను తీర్చిదిద్దుతామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రానున్న కాలంలో థర్మల్ విద్యుత్తుకు ప్రత్యామ్నాయంగా రెనివబుల్ ఎలక్ర్టిసిటీ ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. పెద్ద ఎత్తున సోలార్ ప్లాంట్లను, గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామన్నారు. జపాన్ పర్యటనలో భాగంగా మంగళవారం టోక్యో సమీపంలోని యమానాషీ గ్రీన్ హైడ్రోజన్ కంపెనీ ఆర్ అండ్డీ సెంటర్ ను భట్టి సందర్శించారు. ఈ సందర్భంగా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పాదనను ఆయన పరిశీలించారు.
గ్రీన్ హైడ్రోజన్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ ఉత్పత్తి ప్రక్రియ, ఇతర పునరుత్పాదక ఎలక్ట్రిసిటీ టెక్నాలజీని పరిశీలించి సైంటిస్టులతో చర్చించారు. జపాన్ లో సోలార్ కరెంటుతో నీటిని ఎలక్ట్రోలైజింగ్ ప్రక్రియ ద్వారా హైడ్రోజన్, ఆక్సిజన్ గా విడగొట్టే యంత్ర విభాగాలను ఈ సంస్థ రూపొందిస్తోంది. ఇలా ఉత్పత్తి అయిన హైడ్రోజన్ ను రేసింగ్ కార్లకు ఇంధనంగా, సూపర్ మార్కెట్లలో ఫ్యూయల్ సేల్స్ గా, ఫ్యాక్టరీలలో బాయిలర్లను హీటింగ్ చేసేందుకు వినియోగిస్తున్నామని సైంటిస్టులు ఆయనకు వివరించారు.
ఈ ప్రక్రియలో థర్మల్ విద్యుత్తును కాకుండా సోలార్ విద్యుత్ ను వినియోగిస్తున్నందున దీనిని గ్రీన్ హైడ్రోజన్ గా పేర్కొంటారని చెప్పారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఈ తరహా గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లను తెలంగాణలో ఏర్పాటు చేయడానికి ఇంధన శాఖ సన్నాహాలు ప్రారంభించాలన్నారు. రాష్ట్రంలో నీటి వసతి, సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు అనువైన ప్రదేశాలు విస్తారంగా ఉన్నందున రాష్ట్రమంతటా గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయవచ్చన్నారు. దీనిపై వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆధికారులకు సూచించారు.
సోలార్ కరెంటుతో మిగులు విద్యుత్తు
యమానాషీ పరిశోధన, అభివృద్ధి సంస్థ రూపొందిస్తున్న బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టం (బీఈఎస్ఎస్) బ్యాటరీల తయారీ విభాగాన్ని భట్టి విక్రమార్క పరిశీలించారు. సోలార్ విద్యుత్ ప్లాంట్ల నుంచి పగటిపూట ఉత్పత్తి అవుతున్న విద్యుత్ లో మిగులు విద్యుత్ ను ఆదా చేసుకోవడానికి ఈ బ్యాటరీలు ఉపయోగపడతాయన్నారు. సింగరేణి ఏర్పాటు చేసిన 245 మెగావాట్ల సోలార్ ప్లాంట్లకు, త్వరలో ఏర్పాటు చేయనున్న మరో వెయ్యి మెగావాట్ల సామర్థ్యం ఉన్న సోలార్ ప్లాంట్లకు ఈ సాంకేతికత ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ సందర్భంగా యమానాషీ అధికారులతో భట్టి విక్రమార్క మాట్లాడుతూ తెలంగాణలో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ల ఏర్పాటుకు, బీఈఎస్ఎస్ సాంకేతికత వినియోగంపై ఉమ్మడి భాగస్వామ్యంతో ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకు రావాలని కోరారు. దీనిపై యమానాషీ అధికారులు సానుకూలంగా స్పందించారు.
