- పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో 90% పనులు మేమే చేశాం..
- మిగిలిన 10% పనులైనా రేవంత్ సర్కార్ చేయట్లేదు
- రెండేండ్లలో తట్టెడు మట్టి కూడా తీయలేదు
- పాలమూరు జిల్లాకు కాంగ్రెస్సే విలన్ అని ఫైర్
నాగర్‌కర్నూల్, వెలుగు: పాలమూరు జిల్లాను ఎండబెట్టిందే కాంగ్రెస్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ‘‘పాలమూరుపై సీఎం రేవంత్‌రెడ్డి పగబట్టిండు.. కాళేశ్వరంపై కక్షగట్టిండు. మా హయాంలోనే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 90% పూర్తి చేశాం. కానీ మిగిలిన 10% పనులను చేయకుండా.. ఆ ప్రాజెక్టును పూర్తిగా పండబెట్టి.. రైతులను ఎండగొట్టిండు’’ అని ఫైర్ అయ్యారు.
ఈ ప్రాజెక్టుకు సంబంధించి కాంగ్రెస్ప్రభుత్వం రెండేండ్లలో తట్టెడు మట్టి కూడా తీయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచులను ఆదివారం నాగర్‌కర్నూల్‌లో కేటీఆర్ సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘పాలమూరు జిల్లాకు సాగు నీళ్లు ఇచ్చేందుకు మాజీ సీఎం కేసీఆర్ రూ.35 వేల కోట్లతో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ మొదలుపెట్టారు. రూ.28 వేల కోట్లతో 90 శాతం పనులు పూర్తి చేశారు. 70 టీఎంసీల కెపాసిటీతో రిజర్వాయర్లు కట్టారు. పంప్‌హౌజ్‌ల్లో 145 మెగావాట్ల బాహుబలి మోటార్లు పెట్టారు. మధ్యలో కొన్ని కాల్వల పని మాత్రమే మిగిలింది. కానీ ఆ పనులు కూడా చేయకుండా సీఎం రేవంత్ పాలమూరును ఎండబెట్టారు” అని ఫైర్ అయ్యారు.
మళ్లీ మనదే అధికారం..
నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయంలేకపోవడం వల్లనే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామని కేటీఆర్ అన్నారు. ‘‘బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచులొస్తే క్యాంప్ ఆఫీస్ గేట్దగ్గరి నుంచే గెంటేస్తామని కాంగ్రెస్ఎమ్మెల్యేలు వాగుతున్నారు. సర్పంచ్‌ల అధికారాన్ని ఎవరూ గుంజుకోకుండా రాజ్యాంగమే రక్షణగా ఉంటుంది. బీఆర్ఎస్నాయకులు పట్టించుకోకపోయినా క్యాడర్గట్టిగా నిలబడడం వల్లనే పంచాయతీల్లో సత్తా చాటాం. రానున్న పరిషత్, మున్సిపల్ఎన్నికల్లోనూ ఇదే స్ఫూర్తితో పోరాడాలి” అని ధీమా వ్యక్తం చేశారు.
కేసీఆర్‌కు పేరొస్తదనే పనులు చేస్తలేరు..
పాలమూరు ప్రాజెక్టు పూర్తయితే కేసీఆర్‌కు పేరొస్తదనే, సీఎం రేవంత్ ఆ పనులు చేయట్లేదని కేటీఆర్ ఆరోపించారు. ‘‘పాలమూరు ప్రాజెక్టు పూర్తయితే కేసీఆర్‌కు పేరొస్తదని, తన పాత బాస్‌కు కోపమొస్తదని రేవంత్‌కు భయం. తెలంగాణను 1956లో ఏపీలో విలీనం చేసిన కాంగ్రెస్.. ఇక్కడి రైతుల నోట్లో శాశ్వతంగా మట్టికొట్టింది. అప్పటి నుంచే పాలమూరు వలసలు, ఆకలి చావులు, ఆత్మహత్మల జిల్లాగా మారింది. పాలమూరు జిల్లాకు కాంగ్రెస్ పార్టీనే విలన్” అని మండిపడ్డారు.
