- ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ టీచర్ల సర్వే
- 8 లక్షల మంది పిల్లల్లో వివిధ లోపాలు గుర్తింపు
- ఆ లిస్ట్‌లను మరోసారి జల్లెడ పడ్తున్న ఆర్‌బీఎస్‌కే ఆఫీసర్లు
- వికారాబాద్‌లో పైలెట్ ప్రాజెక్టు సక్సెస్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఐదేండ్లలోపు పిల్లల ఆరోగ్యానికి ప్రభుత్వం డిజిటల్ రక్షణ కల్పిస్తున్నది. బాల భరోసా స్కీమ్‌లో భాగంగా ఓ స్పెషల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై పిల్లల హెల్త్ రికార్డులన్నీ ఈ యాప్‌లోనే పదిలంగా ఉండనున్నాయి. వైద్యారోగ్య శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు సంయుక్తంగా ఈ ప్రక్రియను చేపడుతున్నారు. పిల్లల పుట్టుక నుంచి వచ్చే లోపాలు, పెరుగుదలలో వచ్చే సమస్యలను గుర్తించి.. ఆ డేటాను భద్రపరిచేందుకు టెక్నాలజీని వాడుకుంటున్నారు. కాగా.. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ టీచర్లు, ఆశా వర్కర్ల ద్వారా సర్వే నిర్వహించారు.
సుమారు 18 లక్షల మంది పిల్లలను పరీక్షించగా.. అందులో దాదాపు 8 లక్షల మంది పిల్లల్లో ఏదో ఒక లోపం ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. అయితే, అంగన్‌వాడీల సర్వేలో నైపుణ్యం లేకపోవడం వల్ల చిన్న చిన్న సమస్యలను కూడా పెద్దవిగా నమోదు చేసే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం (ఆర్‌బీఎస్‌కే) మెడికల్ ఆఫీసర్లు రంగంలోకి దిగారు. ఈ 8 లక్షల మంది పిల్లలను డాక్టర్లే స్వయంగా పరీక్షించి.. నిజంగా సమస్యలు ఉన్నవారెవరో తేల్చనున్నారు.
వికారాబాద్‌లో పైలెట్ ప్రాజెక్ట్..
ఈ విధానాన్ని అమలు చేయడానికి ముందే వికారాబాద్‌లో పైలెట్ ప్రాజెక్ట్‌ను చేపట్టారు. అక్కడ అంగన్‌వాడీ టీచర్లు చేసిన సర్వేకు, మెడికల్ ఆఫీసర్లు చేసిన టెస్టులకు మధ్య భారీ తేడా కనిపించింది. అంగన్‌వాడీ టీచర్లు స్మార్ట్ చెక్ 42 అనే టూల్ ద్వారా.. ప్రాథమికంగా చిన్నారుల్లో అనారోగ్య సమస్యల గురించి డేటాను సేకరించారు. అయితే, అంగన్‌వాడీలు గుర్తించిన వారిలో చాలామందికి ఎలాంటి సమస్యలు లేవని డాక్టర్ల పరీక్షల్లో తేలింది. కొంతమంది చిన్నారులు అందుబాటులో లేరని, ఉన్నవారికి మెడికల్ స్క్రీనింగ్ నిర్వహించినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం వికారాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించి పిల్లల ఆరోగ్య వివరాలు సేకరించారు. కొంతమంది పిల్లల్లో మాటలు సరిగ్గా రాకపోవడం, వినికిడి సమస్యలను గుర్తించినట్లు అధికారులు చెబుతున్నారు. డాక్టర్ల స్క్రీనింగ్ తర్వాత కన్ఫర్మ్ అయిన డేటాను మాత్రమే యాప్‌లో నమోదు చేస్తున్నారు.
ఒక్క క్లిక్ తో హెల్త్ వివరాలు
పిల్లల హెల్త్ డేటాను డిజిటలైజ్ చేయడంతో పర్యవేక్షణ సులువు కానున్నది. పిల్లలకు అందుతున్న ట్రీట్‌మెంట్, ప్రస్తుతం వారి హెల్త్ స్టేటస్ ఎలా ఉందనే దానిపై అధికారులందరికీ ఎప్పటికప్పుడు ఆన్ లైన్ నిఘా ఉంటుంది. యాప్‌లో ఒక్క క్లిక్ చేస్తే చాలు.. ఏ జిల్లాలో, ఏ మండలంలో ఎంతమంది పిల్లలకు ఏయే సమస్యలు ఉన్నాయి? ఎంతమందికి కంటి సమస్యలున్నాయి? విటమిన్ సమస్యలు, వినికిడి, కంటిచూపు సమస్యలు ఎన్ని ఉన్నాయి? అనే వివరాలు ఈజీగా తెలిసిపోతాయి. దీనివల్ల బాధితులకు వేగంగా వైద్యం అందించే చాన్స్ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. సర్జరీలు, దీర్ఘకాలిక ట్రీట్‌మెంట్ అవసరమైన పిల్లలను ట్రాక్ చేసి, వారికి పూర్తిగా నయమయ్యే వరకు వైద్యం అందించడానికి ఈ యాప్ ఉపయోగపడుతుంది.
బాల భరోసా లక్ష్యం ఏంటంటే?
పిల్లల్లో చాలామంది పుట్టుకతో వచ్చే, పోషకాహార లోపాలతో బాధపడుతున్నారు. సరైన సమయంలో గుర్తిస్తే నయమయ్యే జబ్బులు కూడా.. నిర్లక్ష్యం వల్ల ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో అంగన్‌వాడీ సెంటర్లకు వచ్చే ఐదేండ్లలోపు పిల్లలందరికీ కాంప్రెహెన్సివ్ హెల్త్ టెస్టులు నిర్వహించి, వారికి అవసరమైన మెడికల్, సర్జికల్ ట్రీట్‌మెంట్‌ను పూర్తిగా ఉచితంగా అందించడమే బాల భరోసా లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు తెలిపారు.
పిల్లల్లో 4డీల గుర్తింపు
ఈ స్కీమ్‌లో రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం (ఆర్‌బీఎస్‌కే) కీలక పాత్ర పోషిస్తున్నది. మొబైల్ హెల్త్ టీమ్స్ ద్వారా అంగన్‌వాడీలు, స్కూళ్లను సందర్శించి పిల్లలను పరీక్షిస్తారు. ప్రధానంగా పిల్లల్లో కనిపించే ‘4డీ’ సమస్యలను వీరు గుర్తిస్తారు. పుట్టుకతో వచ్చే లోపాలు (డిఫెక్ట్స్ ఎట్ బర్త్) అంటే... గుండె జబ్బులు, గ్రహణం మొర్రిలాంటి జబ్బులు, పోషకాహార లోపం, రక్తహీనత, విటమిన్ లోపాలు. చర్మ వ్యాధులు, దంత సమస్యలు, శ్వాసకోశ వ్యాధులు. ఎదుగుదల లోపాలు (డెవలప్‌మెంటల్ డిలేస్), వయసుకు తగ్గ బరువు లేకపోవడం, వినికిడి, దృష్టి లోపాలు, నడవడంలో ఇబ్బందులు గుర్తించి.. అవసరమైన చికిత్స కోసం పెద్ద హాస్పిటల్స్‌కు తీసుకెళ్తారు.
ఎర్లీ స్టేజ్‌లోనే గుర్తించి చికిత్స చేయాలి
పిల్లల్లో డెవలప్‌మెంటల్ డిసీజెస్ (ఎదుగుదల లోపాలు) ఎక్కువగా వస్తున్నాయి. వాటిని ప్రాథమిక దశలోనే గుర్తించి.. సరైన చికిత్స అందిస్తే నయం చేయొచ్చు. ఇప్పటికే ఆర్‌బీఎస్‌కే టీమ్స్ వికారాబాద్‌లో పైలెట్ ప్రాజెక్ట్ నిర్వహించింది. అక్కడి పిల్లల ఆరోగ్య వివరాలను యాప్‌లో నమోదు చేశాం. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా పిల్లల ఆరోగ్య వివరాలను సేకరిస్తాం. ఇందుకు సంబంధించి రూపొందించిన స్పెషల్ యాప్‌లో వారి హెల్త్ వివరాలను నమోదు చేస్తాం. డాక్టర్ సంగీత సత్యనారాయణ, కమిషనర్, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్
