- ప్రజా సమస్యలపై అసెంబ్లీ సెషన్స్‌లో సర్కారును గట్టిగా నిలదీయండి
- సభలో బీజేపీ సభ్యులంతా ఒకే మాటపై ఉండాలి
- బీజేఎల్పీ మీటింగ్‌లో బీజేపీ స్టేట్ చీఫ్ ఎన్.రాంచందర్‌రావు
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ సర్కారు తీరును అసెంబ్లీ సెషన్స్‌లో ఎండగట్టాలని ఆ పార్టీ సభ్యులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు సూచించారు. సభలో సర్కార్‌ను నిలదీసే విషయంలో వెనక్కి తగ్గొద్దని, ప్రజా సమస్యలపై గట్టిగా గళమెత్తాలని స్పష్టం చేశారు. ఆదివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో బీజేపీ శాసనసభాపక్షం (బీజేఎల్పీ) భేటీ అయ్యింది. సోమవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీలో అనుసరించాల్సిన స్ట్రాటజీని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వివరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అస్తవ్యస్తంగా మారిందని, అసమర్థ పాలనతో జనం గోస పడుతున్నారని రాంచందర్‌రావు అన్నారు.
ప్రజా సమస్యలను అసెంబ్లీలో సెంటర్ పాయింట్‌గా చేసి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని రాంచందర్ రావు సూచించారు. సభలో బీజేపీ సభ్యులంతా ఒకే మాటపై ఉంటూ, సమన్వయంతో సర్కారు వైఫల్యాలపై ప్రశ్నించాలన్నారు. వ్యక్తిగత కారణాలతో మీటింగ్‌కు రాలేకపోయిన ఎమ్మెల్యేలతోనూ రాంచందర్‌రావు ఫోన్‌లో మాట్లాడి.. పార్టీ లైన్‌ను వివరించారు. సమావేశానికి బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వెంకటరమణారెడ్డి, రాకేశ్‌రెడ్డి, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, ఏవీఎన్ రెడ్డి, మల్క కొమురయ్య, మహారాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వెదిరె శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.
