పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం : భట్టి విక్రమార్క

పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం : భట్టి విక్రమార్క
  •     త్వరలో ప్రాణహిత చేవెళ్ల మొదలు పెడతాం 
  •     పంద్రాగస్టులోగా రుణమాఫీ పూర్తి చేస్తాం
  •     మీడియాతో డిప్యూటీ సీఏం భట్టి విక్రమార్క

ఆదిలాబాద్, వెలుగు : గత బీఆర్​ఎస్ ప్రభుత్వం పదేండ్లపాటు కాలయాపన చేసి ప్రాజెక్టులను నిర్వీర్యం చేసిందని, పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ పూర్తిచేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. రైతు భరోసా సదస్సులో భాగంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతు భరోసా పథకం అమలు కోసం రైతుల అభిప్రాయాలనే పరిగణలోకి తీసుకోవడం ద్వారా అసలైన రైతులకు న్యాయం జరగుతుందన్నారు.

అన్ని జిల్లాల నుంచి అభిప్రాయాలు సేకరించిన తర్వాత ఆ నివేదికపై శాసనసభలో చర్చించి ఎమ్మెల్యే అభిప్రాయాలు తీసుకుంటామన్నారు. అనంతరం పూర్తిస్థాయిలో పథకం విధివిధానాలు ఖరారు చేస్తామని పేర్కొన్నారు. 2023లో పాదయాత్ర సందర్భంగా ఇక్కడ నెల రోజుల పాటు ప్రజలతో గడపడం ద్వారా ఆదిలాబాద్ జిల్లా పై తనకు సంపూర్ణ అవగాహన వచ్చిందన్నారు. తమ ప్రభుత్వం రాగానే ధరణిపై కమిటీ వేశామని..

రిపోర్టు రాగానే అందరికి న్యాయం జరిగేలా మార్పులు చేస్తామని తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని తుమ్మిడి హెట్టి, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులు త్వరలో మొదలు పెడుతామని, జైనథ్ మండలంలోని చనాక కోరాట ప్రాజెక్టు పూర్తిచేసి రైతులకు నీళ్లందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం కుప్టీ ప్రాజెక్టును కట్టితీరుతామని స్పష్టం చేశారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 కల్లా రుణ మాఫీ చేసి తీరుతామని స్పష్టం చేశారు.