- పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే యువత కోసం అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లు
- వచ్చే విద్యా సంవత్సరం నుంచే యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ ప్రారంభం
- డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
మధిర, వెలుగు : విద్యారంగంలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం, ఈ విషయంపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు, సీఎం అంచనాలకు అనుగుణంగా ఆర్థికశాఖలో ప్రణాళికలు వేసుకొని ముందుకుపోతాం’ అని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క చెప్పారు. ఖమ్మం జిల్లా మధిర క్యాంప్ ఆఫీస్‌లో మంగళవారం విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే గ్రామీణ ప్రాంత యువత కోసం నియోజకవర్గ కేంద్రాల్లోనే అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లు ప్రారంభిస్తామని, పోటీ పరీక్షలకు అవసరమైన మెటీరియల్‌తో పాటు డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. నిష్ణాతులైన అధ్యాపకులతో ఆన్‌లైన్ కోచింగ్ ఇప్పించే ఏర్పాటు సైతం చేస్తున్నామన్నారు. ఖమ్మం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో ఈ సెంటర్లను ప్రారంభించేందుకు ఇప్పటికే ప్రపోజల్స్ సిద్ధం చేశామన్నారు.
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌ను వచ్చే విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ అందించే ఆలోచన చేస్తున్నామని, ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రణాళికలు రూపొందిస్తోందని చెప్పారు. ఉపాధి కల్పనే ప్రధాన ధ్యేయంగా ఐటీఐలను అడ్వాన్డ్స్ టెక్నాలజీ సెంటర్లుగా అప్‌గ్రేడ్ చేసుకుంటున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్‌కు దీటుగా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ప్రతి మండలంలో మూడు ప్రభుత్వ పాఠశాలలను గుర్తించి, దశల వారీగా అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ఇంటర్ స్టూడెంట్లకు మధ్యాహ్న భోజనం కోసం సీఎస్‌ఆర్ నిధుల ద్వారా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ విద్యాసంస్థలన్నింటిపైన సోలార్ రూఫ్ టాప్‌ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలిపారు. సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణ, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నికోలస్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సెక్రటరీ ఆదిత్య భాస్కర్, ఈడబ్ల్యూఎస్ ఐడీ ఎండీ. గణపతిరెడ్డి, ఎన్‌పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి, ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పాల్గొన్నారు.
