
- ఆదాయ వనరుల సమీకరణపై ఆఫీసర్లతో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్, జూపల్లి భేటీ
- కమర్షియల్ ట్యాక్స్, మైనింగ్ శాఖల్లో రాబడి పెరిగిందని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: కమర్షియల్ ట్యాక్స్, మైనింగ్ శాఖల రాబడుల్లో గణనీయమైన పెరుగుదల నమోదైందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. కమర్షియల్ ట్యాక్స్ శాఖలో 4.7 శాతం, మైనింగ్ శాఖలో 18.6 శాతం వృద్ధి రికార్డయిందని చెప్పారు. అయితే, ఇత ర శాఖల్లో ఆదాయ సమీకరణలో వెనుకబాటు ఉందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయా శాఖల్లో ఆదాయ పెరుగుదలకు కమిటీలు వేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.
సోమవారం సెక్రటేరియెట్లో జరిగిన రాష్ట్ర ఆదాయ వనరుల సమీకరణ సబ్ కమిటీ సమావేశానికి కమిటీ చైర్మన్ భట్టి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో మం త్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. సాగునీటి ప్రాజెక్టుల్లో పూడికతీత పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో ప్రాజెక్టుల నీటి నిల్వ సామర్థ్యం పెరగడమే కాకుండా ఇసుక ద్వారా కూడా రాష్ట్రానికి ఆదాయం లభిస్తుందన్నారు.
ప్రాజెక్టులో పూడికతీత కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించాలన్నారు. అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో ఇసుక తవ్వకాన్ని పూర్తిగా గిరిజన ఏజెన్సీల ద్వారానే నిర్వహించాలని మంత్రులు సూచించారు. గిరిజనులకు యంత్ర సామగ్రి అందుబాటులోలేని కారణంగా ఐటీడీఏ ఇంజినీరింగ్ విభాగం సహకరించాలన్నారు. దీంతో గిరిజనులు ఆర్థికంగా బలోపేతం అవుతారన్నారు. అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్న కాలుష్యకారక పరిశ్రమలను తరలించేందుకు మూడు వారాల్లో విధివిధానాలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను మంత్రులు ఆదేశించారు.
ఈ సమావేశంలో సీఎస్ రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఆర్ అండ్ బీ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, సీసీఎల్ఏ కమిషనర్ లోకేశ్ కుమార్, కమర్షియల్ ట్యాక్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, మైన్స్ డైరెక్టర్ శశాంక, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ సురేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు.