
- 95 శాతం పూర్తయిన పనులను త్వరగా కంప్లీట్ చేయాలి: డిప్యూటీ సీఎం భట్టి
- ఆదాయం చూసుకోకుండా గత సర్కార్ అనుమతులు
- ప్రస్తుతం ఏ పనికీ నిధులు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పూర్తిచేయడానికి వనరులను జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో జరిగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాపిటల్ వర్క్స్ కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సీతక్కతో కలిసి ఆయన సమీక్షించారు.
గత పది సంవత్సరాల పాలనలో బడ్జెట్ కేటాయింపులు లేకుండానే విపరీతంగా పనులకు అనుమతులిచ్చారని.. దీనివల్ల ప్రస్తుతం నిధుల కొరతతో అనేక ప్రాజెక్టులు నిలిచిపోయాయని భట్టి అన్నారు. సాధారణంగా ఆదాయానికి, బడ్జెట్ కేటాయింపులకు అనుగుణంగా 1:3 నిష్పత్తిలో పనులు కేటాయిస్తారని.. కానీ, గత ప్రభుత్వం 1:25 నిష్పత్తిలో అనుమతులిచ్చిందని ఆయన విమర్శించారు.
దీనివల్ల ప్రస్తుతం ఆయా పనులను పూర్తిచేయడానికి ఏ పనికీ నిధులు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని ఆయన వివరించారు. ఈ పరిస్థితులను సరిదిద్దాలని వివిధ శాఖల కార్యదర్శులను ఆయన ఆదేశించారు. మొదటగా 95% పూర్తయిన పనులను గుర్తించి, వాటిని త్వరగా పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం సూచించారు. అభివృద్ధి పనులు చేపట్టేటప్పుడు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
కేంద్ర ప్రాయోజిత పథకాలు, నాబార్డ్ సహకారంతో చేపట్టిన పనులను కూడా ప్రాధాన్యతగా భావించి పూర్తి చేయాలని సూచించారు. ఒకవైపు అభివృద్ధి పనులకు నిధులు ఖర్చు చేస్తూనే, మరోవైపు ఆదాయాలను పెంచుకునేందుకు ప్రణాళికలు రూపొందించాలని మంత్రులు అధికారులకు సూచించారు. ఈ సమావేశానికి హాజరైన ఉన్నతాధికారులు తమ శాఖలకు సంబంధించిన ప్రాధాన్యత జాబితాలను సంబంధిత మంత్రులతో చర్చించి సిద్ధం చేసుకుని రావాలని సూచించారు.