కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలడానికి కేసీఆర్, హరీష్ రావే కారణం: డిప్యూటీ సీఎం భట్టి

కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలడానికి కేసీఆర్, హరీష్ రావే కారణం: డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో జరిగిన అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్​ విచారణ జరిపారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. విచారణ సమయంలో జస్టిస్ ఘోష్​ మాజీ సీఎం కేసీఆర్ సహా చాలా మంది వాదనలు విని అనంతరం రిపోర్టు తయారు చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా ఆర్ధిక అవకతవకలు జరిగాయని కమిషన్  నిర్ధారించిందని తెలిపారు. ఆర్ధిక క్రమశిక్షణ లేకపోవడంతో ప్రజాధనం నీళ్ల పాలైందని విమర్శించారు. సోమవారం (ఆగస్ట్ 4) సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. 

కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్టుపై ప్రధానంగా మంత్రి మండలి సమావేశంలో చర్చించారు. అనంతరం భట్టి మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై కేబినెట్ భేటీలో చర్చించామని పేర్కొన్నారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ప్రభుత్వానిది కాదని.. ఇందులో మా ప్రమేయమేమి లేదని స్పష్టతనిచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజీలు కుంగడానికి అప్పటి సీఎం కేసీఆరే కారణమని కమిషన్ తేల్చిందని చెప్పారు. 

నీటి లభ్యత లేదనే సాకుతో ప్రాజెక్టును తమ్మడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చారని.. కానీ ప్రాజెక్టు నిర్మాణ స్థలాన్ని మార్చడం కరెక్ట్ కాదని కాళేశ్వరం కమిషన్ చెప్పిందని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ అసెంబ్లీని తప్పుదోవ పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజీలు కాపాడటానికి కేసీఆర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. 

కేసీఆర్‎తో పాటు అప్పటి నీటి పారుదల శాఖ మంత్రి హరీష్​ రావు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు కూలడానికి ఒక కారమణని అన్నారు. మేడిగడ్డలో బ్యారేజీ నిర్మాణం కేసీఆర్, హరీష్​ రావు సొంత నిర్ణయమేనని.. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేబినెట్ అనుమతి ఉందని అప్పటి ఆర్ధిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పడం కూడా కరెక్ట్ కాదని చురకలంటించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అడుగడుగునా ఉల్లంఘనలు జరిగాయని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ సొంత నిర్ణయాలతో కోట్ల ప్రజా ధనం వృధా అయ్యిందని విమర్శించారు.