
మధిర, వెలుగు: అటవీ సంరక్షణ కమిటీలు అటవీ సంరక్షణలో మాత్రమే కాకుండా గ్రామీణ కుటుంబాలకు జీవనోపాధి అవకాశాలను అందించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తాయని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం మధిరలోని డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయంలో ఖమ్మం అటవీ శాఖ పరిధిలోని మధిర రేంజ్‌లోని గుంటుపల్లి గ్రామ వన సంరక్షణ సమితి సభ్యుల జీవనోపాధి, సామాజిక-ఆర్థిక అభివృద్ధి కోసం వివిధ జీవనోపాధి యూనిట్లు, పరికరాలు భట్టి ద్వారా సభ్యులకు పంపిణీ చేశారు.
పవర్ టిల్లర్లు - 115 యూనిట్లు, రోటేవేటర్లు - 10 యూనిట్లు, ట్రాక్టర్ కల్టివేటర్లు - 11 యూనిట్లు, ఇతర జీవనోపాధి పరికరాలు -టెంట్ హౌస్, ఫొటో స్టూడియో, ఇనుప కేంద్రీకరణ యూనిట్లు, పేపర్ ప్లేట్ల యంత్రం, టైలరింగ్ యంత్రాలు, మినీ ఆయిల్ యంత్రం మొదలైనవి అందజేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ఈ పథకాలు గ్రామీణ యువత, మహిళలకు స్వావలంబనను అందిస్తాయని, అటవీ సంరక్షణలో మరింత భాగస్వామ్యాన్ని తెస్తాయని చెపారు. ఈ కార్యక్రమంలో మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు, అటవీ శాఖ అధికారులు, అటవీ సంరక్షణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.