తెలంగాణ రాష్ట్రంలో సోలార్ పవర్ ఉత్పత్తి పెంచాలి..డిమాండ్ ను బట్టి విద్యుత్ ఇన్ ఫ్రా ఉండాలి : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

 తెలంగాణ రాష్ట్రంలో సోలార్ పవర్ ఉత్పత్తి పెంచాలి..డిమాండ్ ను బట్టి విద్యుత్ ఇన్ ఫ్రా ఉండాలి :  డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
  •     రాష్ట్ర విజన్-2047 అమలులో విద్యుత్ శాఖ కీలకం 
  •     డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
  •     ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల విద్యుత్ శాఖ పని తీరుపై రివ్యూ

ఖమ్మం, వెలుగు : రాష్ట్రంలో సోలార్​పవర్ ఉత్పత్తి పెంచేందుకు చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. డిమాండ్ ను బట్టి విద్యుత్​ఇన్​ఫ్రా పెంచుకోవాలని సూచించారు. ఖమ్మం కలెక్టరేట్ లో శుక్రవారం ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల విద్యుత్ శాఖ అధికారులతో డిప్యూటీ సీఎం రివ్యూ మీటింగ్ నిర్వహించి మాట్లాడారు. తెలంగాణ రైజింగ్ విజన్–2047 అమలులో విద్యుత్ శాఖ కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు. 

ఖమ్మం జిల్లాలో పెరిగే పారిశ్రామిక అవసరాల దృష్ట్యా రెండు 400 కేవీ సబ్ స్టేషన్లు మంజూరు చేస్తామన్నారు. కొత్త పారిశ్రామిక పార్కులను మంజూరు చేశామని, వీటిని దృష్టిలో ఉంచుకొని విద్యుత్ పంపిణీ, రవాణా వ్యవస్థ బలోపేతం చేయాలన్నారు. కరెంట్ స్తంభాలు, తీగలతో ప్రజలకు ప్రాణనష్టం కలగకుండా పొలం బాట కార్యక్రమం కింద ప్రతివారం క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. లైన్ మెన్ నుంచి సీఎండీ వరకు ప్రతి ఒక్కరు బాధ్యతగా, నిబద్ధతతో పనిచేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని సూచించారు. 

విద్యుత్ అంబులెన్స్ లను,  ట్రాన్స్ ఫార్మర్ తో పాటు కావాల్సిన సామగ్రి, టెక్నిషియన్స్ తో సమకూర్చామని, ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఒక విద్యుత్ అంబులెన్స్ అందుబాటులో ఉండాలని సూచించారు. 1912  నంబర్ పై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని, వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని, తనే స్వయంగా ఫోన్ చేసి పరీక్షిస్తానని డిప్యూటీ సీఎం స్పష్టంచేశారు. ఇందిరా సౌర గిరిజల వికాసం కింద సోలార్ పంప్ సెట్ల ద్వారా ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలకు సాగు నీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని, ఇందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. 

కెనాల్స్ పై సోలార్​ పవర్ ప్యానల్స్​ 

నీటి పారుదల మేజర్ కాల్వలు, భూముల వద్ద సోలార్ విద్యుత్ ప్యానల్స్, మీడియం ప్రాజెక్టుల వద్ద ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రపోజల్స్ తయారు చేయాలని ఆదేశించారు. దేవాదాయ భూముల్లో కూడా సోలార్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయాలన్నారు. పైలెట్ ప్రాజెక్టు కింద మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలోని కొన్ని గ్రామాల్లో పూర్తిస్థాయి సోలార్ విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకుంటామన్నారు. వ్యవసాయానికి కూడా ఆసక్తి కలిగినవారికి సోలార్ విద్యుత్ పంపు సెట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టామన్నారు. 

గృహజ్యోతి లబ్ధిదారులకు జీరో బిల్లు అందిస్తూ, నెలకు ఆ కుటుంబానికి ప్రభుత్వం ఎంత బిల్లు చెల్లిస్తుందో కూడా తెలియజెప్పాలని డిప్యూటీ సీఎం తెలిపారు. నిరంతర విద్యుత్ సరఫరా  వ్యవస్థను 90 శాతం పైగా ప్రాంతాల్లో కల్పించామని ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి తెలిపారు. ఎమర్జెన్సీ వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ అమర్చామని చెప్పారు. రాష్ట్రంలో గృహజ్యోతి పథకం కింద దాదాపు రూ. 3 వేల కోట్లను డిస్కమ్ లకు ప్రభుత్వం విడుదల చేస్తుందన్నారు.  

ఖమ్మం సిటీలో అండర్ గ్రౌండ్ పవర్ కేబుల్స్ వేసేందుకు ప్లాన్ తయారు చేయాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో విద్యుత్ శాఖ డైరెక్టర్లు మోహన్ రావు, తిరుపతి రెడ్డి, మధుసూదన్, ప్రభాకర్, సీఈలు సదర్ లాల్, తిరుమల్ రావు, రాజు చౌహాన్, చరందాస్  పాల్గొన్నారు.