ప్రతి పైసా ప్రజల అవసరాలకే ఖర్చు పెడతాం : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

ప్రతి పైసా ప్రజల అవసరాలకే ఖర్చు పెడతాం : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
  • గంధసిరిలో రూ.2కోట్లతో  శివాలయం పునర్నిర్మాణం 

ముదిగొండ, వెలుగు:- ప్రజల సొమ్మును ప్రజల అవసరాలకే ఖర్చు పెడుతున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. గురువారం ముదిగొండ మండలం గంధసిరి గ్రామంలోని రూ.2కోట్లతో కాకతీయుల నాటి శివాలయం పునర్నిర్మాణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పైసా ప్రజల అవసరాలకు ఖర్చు పెడుతోందని, విద్యారంగానికి ఎక్కువ మొత్తంలో నిధులు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. 

అధికారంలోకి రాగానే బహిరంగ మార్కెట్​లో పెరిగిన ధరల ప్రకారం మెస్ చార్జీలు పెంచేందుకు కమిటీ వేసి 20శాతం డైట్, 200 శాతం కాస్మోటిక్ చార్జీలు పెంచామని గుర్తు చేశారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకటి చొప్పున నిర్మిస్తున్నామన్నారు. బోనకల్లు మండలం లక్ష్మీపురంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులు స్పీడ్​గా సాగుతున్నాయని తెలిపారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్​ ఇస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. లబ్ధిదారులు ఎంత తొందరగా ఇందిరమ్మ ఇండ్లు  నిర్మించుకుంటే అంతే వేగంగా బిల్లులు మంజూరు అవుతాయని చెప్పారు. 

ఎన్నికలకు ముందు తాను చేపట్టిన పీపుల్స్ పాదయాత్రలో భాగంగా తన చేయి పట్టుకొని ముదిగొండ మండలంలో ఆవేదన వ్యక్తం చేసిన ప్రియాంక అనే ఆడబిడ్డకు తాను హామీ ఇచ్చానని, ఒక్కదానికే కాదు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రవ్యాప్తంగా ఇల్లు లేని వాళ్లందరికీ ఇండ్లు నిర్మించి ఇస్తామని చెప్పానని, ఆ మాట ప్రకారమే ననేడు ప్రియాంకకు ఇల్లు కేటాయించామని తెలిపారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మొదటి దశలో 3,500 చొప్పున నాలుగున్నర లక్షల ఇండ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. మహిళలంతా ఆత్మగౌరవంతో బతకాలని వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామన్నారు. మధిర నియోజకవర్గంలో 60 వేల మంది మహిళా సభ్యులు ఉన్న  ఇందిరా మహిళా డైయిరీ దేశానికి తలమానికంగా ఉండబోతోందన్నారు. 

రెండు సంవత్సరాల్లో 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని,  లక్షలాది సంఖ్యలో ప్రైవేటు ఉద్యోగాల భర్తీ కోసం ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో యువతకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జాబ్ మేళాలు నిర్వహిస్తోందని తెలిపారు. బీఆర్ఎస్ పాలకులు గత పది సంవత్సరాలు అధికారంలో ఉండి గ్రూప్ వన్, టు పరీక్షను నిర్వహించలేకపోయారని ఎద్దేవా చేశారు. కనీసం రేషన్ కార్డులు కూడా ఇవ్వలేకపోయారన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే అర్హులైన అందరికీ రేషన్ కార్డులు పంపిణీ చేశామని తెలిపారు. 

సొంతింటి కల నెరవేరిన వేళ.. 

దశాబ్ద కాలంగా నిరీక్షించిన నేరవేరని కల నేడు ప్రజా పాలనలో ఇందిరమ్మ ప్రభుత్వం నిరుపేదల సొంత ఇంటి కల నెరవేరుస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ముదిగొండ మండలంలోని గంధసిరిలో పెనుగొండ శివకృష్ణ, నాగమణి ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని పరిశీలించారు.బిల్లులు సకాలంలో చెల్లిస్తున్నారా అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు.