డిప్యూటీ కలెక్టర్ లచ్చిరెడ్డి రాజీనామా

డిప్యూటీ కలెక్టర్ లచ్చిరెడ్డి రాజీనామా
  • ఈ నెల 14న వీఆర్ఎస్​కు దరఖాస్తు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ తహశీల్దార్ల సంఘం(టీజీటీఏ) వ్యవస్థాపక అధ్యక్షుడు, డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షుడు వి. లచ్చిరెడ్డి తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఈ‌‌ నెల 14న స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్ఎస్) కు అనుమతి ఇవ్వాలని మెయిల్ ద్వారా  చీఫ్ సెక్రటరీకి దరఖాస్తు చేశారు. ఈ విషయం ఆదివారం వెలుగులోకి వచ్చింది. లచ్చిరెడ్డి కీసర ఆర్డీవోగా పని చేస్తున్నప్పుడు కేబినెట్​లో చర్చించిన కొత్త రెవెన్యూ చట్టం గురించి తెలుసు కునేందుకు అప్పుటి మంత్రి ఈటల రాజేందర్​ను కలిశారన్న కారణంతో సర్కారు.. ఆయనను జయశంకర్  భూపాలపల్లి జిల్లా భూసేకరణ విభాగానికి డిప్యూటీ కలెక్టరుగా ట్రాన్స్​ఫర్ చేసింది. ప్రాధాన్యత లేని చోట పోస్టింగ్  ఇవ్వడంతో కొంతకాలంగా సెలవులో ఉన్న ఆయన.. స్వచ్ఛంద పదవీ విరమణ కు దరఖాస్తు చేసుకున్నారు.
లచ్చిరెడ్డికి మరో 16 ఏండ్ల సర్వీస్ ఉంది. కాగా, ప్రజలు ఎదుర్కొంటున్న భూ సమస్యలను పరిష్కరించేందుకు ఈ మధ్యే..  ల్యాండ్ డాక్స్ అనే సంస్థను‌‌ అడ్వకేట్ సునీల్​తో కలిసి లచ్చిరెడ్డి ప్రారంభించారు. ఈ సంస్థ ద్వారా ప్రజలకు పూర్తి స్థాయిలో సేవలు అందించేందుకే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.