సర్కారు భూములను అమ్మేసిన డిప్యూటీ కలెక్టర్ .. ఇందిరమ్మ ఇండ్ల స్థలాల పరిశీలనతో... వెలుగు చూసిన బాగోతం

సర్కారు భూములను అమ్మేసిన డిప్యూటీ కలెక్టర్ ..    ఇందిరమ్మ ఇండ్ల స్థలాల పరిశీలనతో... వెలుగు చూసిన బాగోతం
  • సర్కారు భూములను అమ్మేసిన డిప్యూటీ కలెక్టర్
  • హైకోర్టు దగ్గర, మరో 5 చోట్ల  ప్రైవేట్ వ్యక్తికి హౌసింగ్‌‌‌‌ బోర్డు భూమి రిజిస్ట్రేషన్‌‌‌‌
  •   గత ప్రభుత్వంలో హౌసింగ్ బోర్డులో పనిచేసిన సమయంలో దందా
  •   ఇందిరమ్మ ఇండ్ల స్థలాల పరిశీలనతో వెలుగు చూసిన బాగోతం
  •    మంత్రి పొంగులేటి సీరియస్, అక్రమ సేల్ డీడ్ల రద్దుకు ఆదేశాలు
  •    డిప్యూటీ కలెక్టర్​ రామునాయక్ సస్పెన్షన్.. సహకరించిన ఇద్దరు ఉద్యోగులపైనా వేటు
  •    ప్రభుత్వ భూములను కాజేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక

హైదరాబాద్ ,వెలుగు: ప్రభుత్వ ఆస్తులను రక్షించాల్సిన అధికారులే భూబకాసురులుగా మారారు. గత బీఆర్‌‌‌‌ఎస్ ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వ భూములను యథేచ్ఛగా కొల్లగొట్టారు. పేదల కోసం కేటాయించిన హౌసింగ్ బోర్డు స్థలాలను సైతం సొంత జాగీరులా అమ్మేశారు. ఈ  భూదందాకు సూత్రధారి అయిన  రెవెన్యూ శాఖ డిప్యూటీ కలెక్టర్ రామునాయక్‌‌‌‌ను ప్రభుత్వం తాజాగా సస్పెండ్​ చేసింది. ఇందిరమ్మ ఇండ్లకు ఖాళీ స్థలాల పరిశీలన నేపథ్యంలో వెలుగుచూసిన ఈ భారీ కుంభకోణంపై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రామునాయక్‌‌‌‌ను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు  అతడికి సహకరించిన మరో ఇద్దరు అధికారులపై కఠిన చర్యలు తీసుకున్నారు. అక్రమ సేల్ డీడ్లను తక్షణమే రద్దు చేయాలని ఆదేశించారు.

హైదరాబాద్ క్యూర్ పరిధిలో పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి స్థలాలను గుర్తించేందుకు అధికారులు తెలంగాణ హౌసింగ్ బోర్డు భూములను పరిశీలించారు. ఈ క్రమంలోనే డిప్యూటీ కలెక్టర్ రామునాయక్ గతంలో చేసిన ‘భూలీలలు’ ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. రామునాయక్ 2013 నుంచి 2018 వరకు డిప్యూటేషన్‌పై హౌసింగ్ బోర్డులో ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్ (ఎల్ఏవో)గా బాధ్యతలు నిర్వహించారు. ఈ ఐదేండ్ల కాలంలో ఆయన అనేక అక్రమ రిజిస్ట్రేషన్లు, భూ దందాలకు పాల్పడినట్టు ప్రాథమిక విచారణలో నిగ్గుతేలింది. తీగ లాగితే డొంక కదిలినట్లు.. ఈ తనిఖీల్లోనే ఆయన అక్రమాల చిట్టా అంతా బయటపడింది.
గజం 2 లక్షల భూమి.. ఉచితంగా రాసిచ్చేశారు

బహిరంగ మార్కెట్‌లో గజం రూ. 2 లక్షలకు పైగా పలుకుతున్న హైకోర్టు 5–-6 గేట్ల మధ్య ఉన్న తెలంగాణ హౌసింగ్ బోర్డుకు చెందిన 33.53 చదరపు గజాల విలువైన స్థలాన్ని రామునాయక్ 2018 ఫిబ్రవరి 17న అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించారు. గతంలో హౌసింగ్‌బోర్డులో వర్క్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసి ఉద్యోగం నుంచి రిమూవ్​అయిన ఇఫ్తాకర్ అహ్మద్ భార్య సుబియా సుల్తానా పేరిట ఈ భూమిని రాసేశారు. కనీసం ఈ భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ డబ్బులు కూడా నేటి వరకు బోర్డుకు జమ కాలేదంటే అక్రమాలు ఏ స్థాయిలో జరిగాయో అర్థం చేసుకోవచ్చు. బోర్డు అనుమతులను, అసలు పత్రాలను కనీసం పరిశీలించకుండా కళ్లు మూసుకుని రిజిస్ట్రేషన్ చేసిన నాటి చార్మినార్ సబ్ రిజిస్ట్రార్‌పై కూడా మంత్రి విచారణకు ఆదేశించారు. కాగా, కాలక్రమంలో 2025 ఏప్రిల్‌లో ఈ భూమిని సుబియా సుల్తానా మరొకరికి విక్రయించింది. రామునాయక్ భూ దందాలపై 2017 నుంచి పలు కేసులు ఉన్నప్పటికీ, అప్పటి బీఆర్‌ఎస్ పాలకులు, అధికారులు స్పందించకుండా తొక్కిపెట్టినట్టు తెలిసింది. కేవలం హైకోర్టు పరిసర ప్రాంతమే కాకుండా విజయనగర్ కాలనీలో 400 చదరపు గజాలు, తుల్జాగూడలో 22 చదరపు గజాలు, లక్ష్మిగూడలో 130 చదరపు గజాలు, మహబూబ్ గంజ్‌లో 497 చదరపు గజాల విలువైన ప్రభుత్వ స్థలాలను పలువురి పేరిట  రామునాయక్ అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించినట్టు గుర్తించారు. 2016 నుంచి జరిగిన ఈ భూదందాలన్నింటిపై లోతైన విచారణ జరపాలని, ఈ కేసుల్లో సబ్ రిజిస్ట్రార్ల పాత్రపైనా ఎంక్వైరీ చేయాలని స్టాంప్స్ అండ్​ రిజిస్ట్రేషన్ ఐజీని మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి ఆదేశించారు.


ఎంతటివారైనా సరే.. వదిలిపెట్టే ప్రసక్తే లేదు: మంత్రి పొంగులేటి


ప్రభుత్వ అధికారిగా ఉంటూ అక్రమాలకు తెగబడిన రామునాయక్‌ను తక్షణమే సస్పెండ్ చేశామని, యుద్ధప్రాతిపదికన విచారణ పూర్తి చేసి అన్ని ఆధారాలతో ఆయనను ఉద్యోగం నుంచి ‘శాశ్వతంగా తొలగిస్తామని’ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. అలాగే, ఈ భూ అక్రమాలకు సహకరించిన సూపరింటెండెంట్ వివేకానంద్‌కు రిటైర్‌‌మెంట్‌కు మరో పదేండ్ల సర్వీసు ఉండగానే విధుల్లోంచి శాశ్వతంగా తొలగించామని, మరో సూపరింటెండెంట్ బోనా నాయక్‌ను సస్పెండ్ చేశామని వెల్లడించారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన వ్యక్తులే వాటిని దోచుకోవాలని చూడటం అత్యంత దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. ప్రభుత్వ భూములపై కన్నేసిన వారెవ్వరినీ వదిలిపెట్టబోమని, వారు ఎంతటి హోదాలో ఉన్నా, ఎంతటి పలుకుబడి కలిగిన వారైనా చట్టం ముందు సమానమేనని స్పష్టం చేశారు.  ‘‘ప్రజల ఆస్తులను కబ్జా చేయాలనే దురాలోచనతో వ్యవహరించే వారిపై నిర్దాక్షిణ్యంగా చర్యలు ఉంటాయి.

ప్రభుత్వ ఉద్యోగి అనే పేరుతో అక్రమాలకు పాల్పడితే శిక్ష మరింత కఠినంగా ఉంటుంది. ప్రభుత్వ భూములను కొల్లగొట్టే అధికారులకు ప్రభుత్వ సేవలో కొనసాగే అర్హతే లేదు. ఇలాంటి వారిని గుర్తించి శాశ్వతంగా తొలగిస్తాం. ప్రభుత్వ భూములను అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు నకిలీ పత్రాలు సృష్టించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతోపాటు శాఖాపరమైన చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించాం. ప్రభుత్వ భూముల పరిరక్షణలో రాజీపడే ప్రసక్తే లేదు, భూకబ్జాలు, అధికార దుర్వినియోగంపై ప్రత్యేక నిఘా ఉంటుంది. తప్పు చేసిన వారు చట్ట ప్రకారం కఠిన మూల్యం చెల్లించుకోక తప్పదు”అని మంత్రి స్పష్టం చేశారు.