పసిఫిక్ సముద్రంలో సముద్ర జలాలు వార్మ్ అయినప్పుడు ఎల్‌నినో అని, చల్లబడ్డప్పుడు లానినా అని లాటిన్ అమెరికాలో అభివర్ణిస్తారు. అయితే గత కొన్నేండ్లుగా భూమి ఉష్ణోగ్రతలు పెరుగుతూ ప్రపంచ వాతావరణ ధోరణులను మార్చుతున్న నేపథ్యంలో ఎల్‌నినో ఏర్పడడం ఆయా ప్రాంతాలలో వేడిని తీవ్రస్థాయికి పెంచుతోంది. వర్షాభావ పరిస్థితులకు కారణం అవుతున్నది.
దరిమిలా ఏర్పడుతున్న పరిణామం నీటి కరువు. స్పష్టంగా ఎల్‌నినో వల్ల కరువు ఏర్పడడం లేదు. పెరుగుతున్న పుడమి ఉష్ణోగ్రతలకు ఎల్‌నినో పరిస్థితులు తోడు అయినాయి. వాతావరణ మార్పుగా మనం అభివర్ణిస్తున్న పరిస్థితిని మనం లోతుల్లోకి పోయి పరిశీలించడం లేదు. క్లైమేట్ చేంజ్ అంటే భూమిమీద వేడితో జలం, వాయువు వ్యవస్థలు పరివర్తనం చెందుతున్నాయి. ఈ మూడింటి మధ్య, భూమి, నీళ్లు, గాలి మధ్య నిరంతరం ఉండే సంబంధం తీవ్రంగా మారుతోంది. ఇది అనిశ్చితికి దారి తీస్తున్నది.
ఈ అనిశ్చితి వల్ల వాతావరణ ధోరణులు, ఎల్‌నినో, లానినా, అల్పపీడనాలు, సుడి గాలులు, నైరుతి రుతుపవనాలు వగైరాలు కూడా మారుతున్నాయి. ఈ మార్పులను అర్థం చేసుకునేందుకు, ముందుగానే పసిగట్టి హెచ్చరించేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తూనే ఉన్నారు. వివిధ దేశాల మధ్య సమన్వయం వాతావరణం విషయంలో మాత్రం ఉన్నది.
శాస్త్రవేత్తలు ముందస్తుగానే హెచ్చరిస్తున్నా పాలకులు, ప్రజల స్పందన మాత్రం అంతంత మాత్రమే ఉన్నది. నీటి బడ్జెట్ ప్రక్రియ కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధులలో భాగం చేస్తే కరువు లాంటి ప్రకృతి వైపరీత్యం ఏర్పడినప్పుడు స్పందన సమాజహితంగా ఉండే అవకాశం ఉంటుంది.
ఘోరంగా నీటి వనరుల అభివృద్ధి
కరువు ఏర్పడడం మొదటిసారి కాదు. కరువు పట్ల మానవాళికున్న అనుభవాలను, ఇదివరకటి మంచి స్పందనా పద్ధతులను ఎందుకు మనం వాడుకోలేకపోతున్నాం? ప్రతికూల ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు అనేక స్థాయిలలో ప్రణాళికలు, పథకాలు, ఆలోచనలు, నిర్దిష్ట చర్యలు తయారుగా ఉన్నాయి. అన్నీ పేపర్ మీద ఉన్నాయి. ఇవేవీ వర్షాభావ పరిస్థితులతో అవసరమైనప్పుడు పథకాలుగా, విధానాలుగా మారడం లేదు. విపరీత వర్షాలకు ఎల్లో అలెర్ట్ మాదిరి మార్పు వర్షాభావ పరిస్థితుల అంచనాలలో, స్పందన విధానాలలో రావాలి.
ఈ ఒక్క సంవత్సరం తక్కువ పడితే కరువు ఇంత భయానకంగా ఎందువల్ల మారింది? వర్షం మీదనే ఆధారపడకుండా లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వం పెట్టుబడి పెట్టి భారీ ప్రాజెక్టులు కట్టారు కదా. కేవలం ఒక్క నెలలో కొన్ని రోజులు వర్షం పడకుంటే తీవ్ర కరువుకు ఆస్కారం ఏర్పడింది అంటే మన నీటి వనరుల అభివృద్ధి ఎంత ఘోరంగా ఉందో ఊహించుకోవచ్చు.
ఇన్ని ఏండ్లు చేసిన ‘అభివృద్ధి’లో సుస్థిరత లేదు అని అర్థం అవుతున్నది. వర్షం లేకుంటే చిగురుటాకులా వణికిపోతున్న ఆర్థిక అభివృద్ధిలో ఉన్న డొల్లతనం ఇప్పుడు బయటపడుతున్నది.
వర్షపు నీటిని పట్టుకునే వ్యవస్థ కనుమరుగు
నెత్తిమీద పడిన వర్షం కాళ్ళ కిందనుంచి వేగంగా నదిలోకి, ఆనక సముద్రంలోకి పోవడం ఈ డొల్ల అభివృద్ధి పర్యవసానం అని ఇప్పటికీ కూడా చాలామందికి అర్థం కావడం లేదు. ఇదివరకు మన అవసరాలు తీరినాక సముద్రంలోకి ప్రవహించేవి ఈ నీళ్ళు. ఇప్పుడు నీటి కరువు ఉన్నా నెత్తిమీద పడిన వర్షపు నీటిని పట్టుకునే వ్యవస్థ కనుమరుగు అయ్యింది.
పడిన నీళ్ళు పడినట్టే పారుతున్నాయి. ఆపే వ్యవస్థ, భూమిలోకి ఇంకే అవకాశాలు లేవు. వర్షం నీటిని నిలువరించే ప్రకృతి వ్యవస్థలో ఉండే అడవులు, తోపులు, చెట్లు, పొదలు, మట్టి పొరలు, గుట్టలు అన్నీ మాయమవుతున్నాయి.
నీటి పాయలు, ఊటలు, చిన్న వాగులు, పెద్ద వాగులు, ఉప నదులు వగైరా నీటి పరీవాహక వ్యవస్థలో భాగం అయిన కీలక ప్రాకృతిక నిర్మాణాలను దారి మళ్లిస్తున్నాం, చేజేతులా నాశనం చేసుకుంటున్నాం. భూమ్మీద పడిన వర్షం నీళ్లు నెమ్మదించకుంటే, ఆగకుంటే, భూగర్భ జలమట్టాలు పెరగవు. శాస్త్రవేత్తలు మార్చి నెల నుంచి హెచ్చరిస్తున్నా నీటి నిలువ సామర్థ్యం పెంచే ఆలోచన ప్రభుత్వం చేయడం లేదు. పెద్ద నీటి రిజర్వాయర్లు లేదా ఇంకుడు గుంతలు. సుస్థిర, దీర్ఘకాలిక పరిష్కారాలను పట్టించుకోవడం లేదు.
రైతుల జీవనోపాధిపై ప్రభావం
అధిక ఉష్ణోగ్రతలు, భూగర్భ జలాల క్షీణత వంటి పరిణామాలు కేవలం ఒక సీజన్‌కు పరిమితమైన సమస్యలు కాక, వ్యవసాయ వ్యవస్థ మొత్తాన్ని దీర్ఘకాలంలో మరింత ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉంది. తెలంగాణలో ప్రధానంగా వర్షాధార వ్యవసాయంపై ఆధారపడిన ప్రాంతాల్లో పంటల ఎదుగుదల పూర్తిగా రుతుపవనాలు సకాలంలో రావడంపైనే ఆధారపడి ఉంటుంది.
కావున వర్షపాతంలో ఏర్పడే ఏ చిన్న హెచ్చుతగ్గులైనా ఇక్కడి రైతుల జీవనోపాధిపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి. నేలలో తేమ తగ్గితే పంటల మీదనే కాదు వ్యవసాయ అనుబంధ రంగాల మీద, గ్రామీణ జీవనోపాధుల దుష్ప్రభావం మీద పడుతుంది.
తెలుగు రాష్ట్రాలు దేశ ఆహార భద్రతలో వ్యూహాత్మక స్థానాన్ని కలిగి ఉన్నాయి. అందువల్ల ఇక్కడ ఏర్పడే ఉత్పత్తి తగ్గుదల కేవలం స్థానిక సమస్యగా మిగిలిపోదు. జాతీయ స్థాయిలో ఆహార ధాన్యాల లభ్యత, మార్కెట్ ధరల స్థిరత్వం, ఎగుమతుల సామర్థ్యం, వినియోగదారుల సంక్షేమంపైనా ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. ఎల్‌నినో ప్రభావాన్ని కేవలం ఒక వాతావరణ సమస్యగా కాకుండా, జాతీయ ప్రాధాన్యత కలిగిన ఆర్థిక, సామాజిక సవాలుగా పరిగణించాల్సిన అవసరం ఉంది.
పరిణామాలు
ఎల్‌నినో ప్రభావం కేవలం వర్షాభావం సమస్య కాదు. ఇది వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని ప్రభావితం చేసే సంక్షోభం. దీని పర్యవసానాలు ఒకదానితో ఒకటి ముడిపడి, గొలుసుకట్టు ప్రభావంగా విస్తరిస్తాయి. మొదటగా, రుతుపవనాల ఆలస్యం, అసమాన వర్షపాతం వల్ల ఖరీఫ్ పంటల విస్తీర్ణం తగ్గి, దిగుబడులు గణనీయంగా పడిపోతాయి.
రైతుల పెట్టుబడి వ్యయం పెరుగుతోంది, ఎందుకంటే తగ్గిన వర్షపాతాన్ని భర్తీ చేసేందుకు అదనపు నీటిపారుదల, ఎరువులు, పురుగుమందులపై ఖర్చు పెరుగుతుంది. అయితే ఇదే సమయంలో దిగుబడి, ఆదాయం తగ్గడం వల్ల రైతులు అప్పుల ఊబిలో మరింత కూరుకుపోతున్నారు, ఇది దీర్ఘకాలంలో వారి ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీస్తుంది.
తద్వారా వీరి జీవనోపాధి మరింత అభద్రతలో పడుతోంది. అదేవిధంగా, పాడి పరిశ్రమ, గొర్రెలు, మేకల పెంపకం, మత్స్యరంగంపైనా ఎల్‌నినో ప్రతికూల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. - పశుగ్రాసం, నీటి కొరత వల్ల పశు సంరక్షణ వ్యయం పెరుగుతోంది, జలాశయాల్లో నీటి మట్టం తగ్గడం మత్స్య సంపదపై ప్రభావం చూపుతోంది. ఇంతలో, తగ్గిన వర్షపాతాన్ని పూడ్చుకునేందుకు రైతులు భూగర్భ జలాలపై ఆధారపడటం పెరుగుతోంది, దీనివల్ల ఇప్పటికే ఒత్తిడిలో ఉన్న భూగర్భ జల వనరులు మరింత క్షీణించి, భవిష్యత్తు నీటి భద్రతకే ముప్పు ఏర్పడుతోంది.
వాతావరణ అనుకూల వ్యవసాయం
దీర్ఘకాలిక కోణంలో చూస్తే, నేలలో తేమ నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు పశువుల ఎరువు, కంపోస్ట్, వర్మీ కంపోస్ట్, గ్రీన్ మ్యాన్యూర్, జీవామృతం వంటి సహజ, సేంద్రీయ ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించడం అత్యంత కీలకం.
అదే విధంగా క్రాప్ హాలిడే ప్రకటించిన ప్రాంతాల్లో భూమిని ఖాళీగా వదిలేయకుండా కాంటూర్ బండింగ్, ఫార్మ్ పాండ్లు, రీచార్జ్ ట్రెంచ్‌లు, చెక్‌డ్యామ్‌లు వంటి భూసంరక్షణ - జల సంరక్షణ కార్యక్రమాలను చేపట్టడం ద్వారా భవిష్యత్ సాగుకు భూములను సిద్ధం చేయడంతో పాటు వర్షపు నీటిని ఒడిసిపట్టే సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు.
నీటి యాజమాన్యం విషయంలో, డ్రిప్, స్ప్రింక్లర్ వంటి సూక్ష్మ నీటిపారుదల వ్యవస్థలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి, ఉపరితల జలాలు, భూగర్భ జలాలను వేర్వేరుగా కాకుండా సంయుక్తంగా వినియోగించే విధానాన్ని అనుసరించడం ద్వారా నీటి వనరులపై ఒత్తిడిని సమతుల్యం చేయవచ్చు.
దీనికి తోడు, రాష్ట్ర స్థాయిలో సమగ్ర నీటి విధానాన్ని రూపొందించి, వాతావరణ సమాచారం ఆధారంగా పంటల ప్రణాళిక, నీటి బడ్జెటింగ్, గ్రామస్థాయి నీటి పాలనను బలోపేతం చేయడం ద్వారా దీర్ఘకాలిక నీటి భద్రతను సాధించవచ్చు. నేల ఆరోగ్యం, నీటి సంరక్షణ, వాతావరణానికి అనుగుణమైన పంటల ప్రణాళిక, రైతుల ఆదాయ భద్రత, గ్రామీణ జీవనోపాధుల బలోపేతం కలిసిన సమగ్ర విధానంతోనే ఆహార భద్రతను, రైతుల సంక్షేమాన్ని, సుస్థిర అభివృద్ధిని సాధించగలం.
పరిష్కారాలు.. తక్షణ చర్యలు
ఈ పరిస్థితులను తాత్కాలిక ఉపశమన చర్యలతో మాత్రమే ఎదుర్కోవడం సాధ్యం కాదు. తక్షణ చర్యలు, దీర్ఘకాలిక వాతావరణ అనుకూల వ్యవసాయ విధానాలు రెండూ సమాంతరంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. తక్షణ చర్యల్లో భాగంగా, ముందుగా శాస్త్రీయ ప్రమాణాల ఆధారంగా కరువు ప్రభావిత ప్రాంతాలను కచ్చితంగా గుర్తించడం అవసరం. తద్వారా పరిమిత వనరులను అత్యంత అవసరమైన ప్రాంతాలకు మళ్లించవచ్చు. ఇదివరకు మాదిరి కరువు మండలాల ప్రకటన వివిధ విధానాల మార్పుకు కీలకం.
ఈ ప్రాంతాల్లోని రైతులకు ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక, నాణ్యమైన విత్తనాలు, సకాలంలో వ్యవసాయ సలహాలు అందించడం ద్వారా నష్టాన్ని తగ్గించవచ్చు. రైతులకు మద్దతు అందించడం ద్వారా వారిని ఆర్థిక ఒత్తిడి నుంచి తక్షణం ఆదుకోవాలి.
పంటల కొనుగోలు, గిట్టుబాటు ధర, బోనస్ ప్రకటనల ద్వారా ధరల భరోసా కల్పించడం రైతుల విశ్వాసాన్ని నిలబెడుతుంది. ఇక పశుగ్రాసం, పశుదాణా సరఫరాను పెంచడంతోపాటు, గ్రామీణ ఉపాధి హామీ వంటి కార్యక్రమాలను విస్తరించడం ద్వారా ఉపాధి కోల్పోయిన కూలీలకు, కౌలు రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను కల్పించవచ్చు.
డా. దొంతి నరసింహారెడ్డి, పాలసీ ఎనలిస్ట్
