డబుల్ ఇండ్లు కట్టిస్తమని..  రోడ్డున పడేస్తరా..?

డబుల్ ఇండ్లు కట్టిస్తమని..  రోడ్డున పడేస్తరా..?
  • అనుచరులకు ఇచ్చుకుంటున్న అధికార పార్టీ నేతలు
  • మన్సూరాబాద్ నాంచారమ్మ బస్తీవాసుల ఆరోపణ 

ఎల్​బీనగర్, వెలుగు: డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తామని చెప్పి.. తమ గుడిసెలను ఖాళీ చేయించి.. ఇప్పుడు ఇవ్వకుండా రోడ్డున పడేశారని.. అనర్హులకు కేటాయిస్తున్నారని ఎల్​బీనగర్ మన్సురాబాద్ లోని ఎరుకల నాంచారమ్మ బస్తీవాసులు రెండురోజులుగా ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. సోమవారం భారీ వర్షాన్ని కూడా లెక్కచేయకుండా బాధితులు దీక్ష కొనసాగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుడిసెల్లో  ఉంటుండగా డబుల్​ఇండ్లు కట్టిస్తామని చెప్పి, 2016లో ఫొటోలు తీసుకున్నారని, చివరకు కేటాయించకుండా అధికార పార్టీ నేతలు మోసం చేశారని ఆరోపించారు.

పుస్తెల తాడు కుదవపెట్టుకొని ఇంటి రెంట్లు కట్టుకునే పరిస్థితి వచ్చిందని, దీనిపై ఆఫీసర్లు,  నాయకుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడంలేదని వాపోయారు. అధికార పార్టీ నేతలు తమ అనుచరులకు డబుల్ ఇండ్లు కట్టబెడుతున్నారని, తమకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. న్యాయం చేసేంత వరకు తమ పోరాటం ఆపమని స్పష్టంచేశారు.  దీక్షలో జగన్నాథం, గంగయ్య, స్వామి, ఏసు సిద్దు, హేమలత, పాపమ్మ, పోచమ్మ కూర్చున్నారు.