న్యూఢిల్లీ: కరోనా వలన రియల్ ఎస్టేట్ సెక్టార్ కూడా నష్టపోయినప్పటికీ, ఈ ఇండస్ట్రీ వేగంగా రికవరీ అవుతోంది. అన్ని మెట్రో సిటీల్లో లావాదేవీలు పెరుగుతున్నాయి. దీంతో రెసిడెన్షియల్ సెగ్మెంట్లో ఇన్వెస్ట్ చేయాలా? లేదా కమర్షియల్ సెగ్మెంట్లో ఇన్వెస్ట్ చేయాలా? అని ఇన్వెస్టర్లలో గందరగోళం ఉంది. ఈ అంశంపై ఇండస్ట్రీ ఎక్స్పర్టులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. గత రెండేళ్లుగా కమర్షియల్ రియల్ ఎస్టేట్ సెగ్మెంట్ పెద్దగా గ్రోత్ చెందలేదని, 2022 లో ఈ సెగ్మెంట్ గ్రోత్ బాట పడుతుందని అవంత ఇండియా ఎండీ నకుల్ మథుర్ అభిప్రాయపడ్డారు. రెసిడెన్షియల్ స్పేస్‌లతో పోలిస్తే కమర్షియల్ స్పేస్‌లపై ఎక్కువ రెంట్ వస్తుందని అభిప్రాయపడ్డారు. లాంగ్ టెర్మ్ లీజులు, కాంట్రాక్ట్‌లు కుదుర్చుకోవడం వలన రియల్టీ ఇన్వెస్టర్లకు ఇన్కమ్ వస్తూనే ఉంటుందని చెప్పారు. ఈ ఏడాది ఆఫీస్‌లు, కో–వర్కింగ్ స్పేస్‌లు, అఫోర్డబుల్ షాప్‌లు వంటి వాటిలో కమర్షియల్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్లు ఎక్కువగా జరుగుతాయని నకుల్ అన్నారు. ‘తాజాగా కమర్షియల్ స్పేస్‌లో ఫ్రాక్షనల్ ఓనర్షిప్ కాన్సెప్ట్ బాగా పెరుగుతోంది. ఇన్వెస్టర్లు మొత్తం ప్రాపర్టీని కొనాల్సిన అవసరం లేదు. ఈ ప్రాపర్టీలో కొంత వాటా కోసం ఇన్వెస్ట్ చేయొచ్చు. మంచి రిటర్న్‌లను పొందొచ్చు. ఈ ఏడాది కూడా ఫ్రాక్షనల్ ఓనర్షిప్ కాన్సెప్ట్‌కు డిమాండ్ ఉంటుంది’ అని నకుల్ అభిప్రాయపడ్డారు.
ఏ రియల్ ఎస్టేట్ సెగ్మెంట్లో ఇన్వెస్ట్ చేయాలనేది ఇన్వెస్టర్ ఎంత కాలం వరకు ఇన్వెస్ట్మెంట్లను హోల్డ్ చేయగలడనే అంశంపై ఆధారపడి ఉంటుందని రియల్ ఎస్టేట్ అండ్ ఫండ్ మేనేజ్మెంట్ రిసోర్స్ స్పెషలిస్ట్ సిద్ధార్థ్ మౌర్య అన్నారు. పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయడానికి, ఎక్కువ కాలం ఇన్వెస్ట్మెంట్లను హోల్డ్ చేయడానికి రెడీగా ఉండే ఇన్వెస్టర్లు కమర్షియల్ రియల్ ఎస్టేట్ ఆప్షన్‌ను ఎంచుకోవాలని ఆయన సలహా ఇచ్చారు. లొకేషన్ కీలకమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌కు ఎంత దూరంలో ఉంది వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని కమర్షియల్ ప్రాపర్టీలను కొనుగోలు చేయాలని అన్నారు. ‘ఫ్లాట్లు, అపార్ట్మెంట్లు వంటి ప్రాపర్టీల రేట్లు కమర్షియల్ ప్రాపర్టీల కంటే తక్కువగా ఉంటాయి. అందుకే రెంట్ల కోసం ఈ ప్రాపర్టీలలో చాలా మంది ఇన్వెస్ట్ చేస్తారు. రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ మార్కెట్ రికవరీ కూడా కమర్షియల్ రియల్టీతో కలిసే ఉంటుంది. ఆఫీస్‌లకు ఉద్యోగులు వస్తే అపార్ట్మెంట్లు వంటి రెసిడెన్షియల్ ప్రాపర్టీలకు రెంట్ల పరంగా డిమాండ్ పెరుగుతుంది’ అని గోయల్ గంగా గ్రూప్ అండ్ ప్రెసిడెంట్ (ఎలెక్ట్), ఎండీ అతుల్ గోయల్ అన్నారు. తాజా రిపోర్ట్స్ ప్రకారం, కిందటేడాది జులై–సెప్టెంబర్ మధ్య 1.2 కోట్ల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్‌ను లీజుకు లేదా కాంట్రాక్ట్‌కు తీసుకున్నారు. అంతకు ముందు ఏడాది ఇదే టైమ్ పీరియడ్‌తో పోలిస్తే ఇది 168 శాతం ఎక్కువ. హైదరాబాద్, చెన్నై, నోయిడా, ఢిల్లీ, ముంబై వంటి రియల్ ఎస్టేట్ మార్కెట్లు కమర్షియల్ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
