- లండన్ తరహాలో కేబుల్ బ్రిడ్జి
- బెంగళూరు హైవే నుంచి పీవీ ఎక్స్ ప్రెస్ హైవే కు లింక్
- ఈ నెలాఖరులోపు పనులు స్టార్ట్
- పాత నగరం సిగలో కొత్త నగ!
హైదరాబాద్: పాతనగరం సిగలో మరో నగ ఒదిగిపోనుంది. నవాబులు నిర్మించిన మీరాలం చెరువుకు మహర్దశ పట్టనుంది. ఈ చెరువులో లండన్ ఐ తరహాలో హైదరాబాద్ ఐ నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. రెండున్నర కిలోమీటర్ల మేర.. సస్పెన్షన్ బ్రిడ్జ్ నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఈ సస్పెన్షన్ బ్రిడ్జిని పీవీ ఎక్స్ ప్రెస్ హైవేకు లింక్ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన పనులు ఈ నెలాఖరు నాటికి ప్రారంభమవుతాయని తెలుస్తోంది. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి నిన్న అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. దుర్గం చెరువు మాదిరిగానే మీర్ అలం చెరువుపై కేబుల్ బ్రిడ్జి నిర్మించాలని గత ప్రభుత్వానికి ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విజ్ఞప్తి చేశారు. అయితే అది కార్యరూపం దాల్చలేదు.
పాతనగరం అభివృద్ధిపై దృష్టి సారించిన సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా దవాఖానను గోషామహల్ లో నిర్మించినున్నటు ప్రకటించిన విషయం తెలిసిందే. అదే విధంగా మెట్రో సేవలను పాతనగరానికి విస్తరించనున్నట్టు తెలుపడంతోపాటు బడ్జెట్ లో కేటాయింపులు కూడా చేశారు. పాతనగరానికి కొత్త సొబగులు అద్దేందుకు ప్రత్యేకమైన కార్యచరణతో సర్కారు ముందుకు సాగుతోంది.
ALSO READ | Indian Army: హైదరాబాద్కు వరదలొస్తే.. హుస్సేన్ సాగర్లో భారత సైన్యం ఏం చేసిందంటే..
ఇదే తరుణంలో పర్యాటకులను ఆకర్షించేందుకు అమెరికాలోని న్యూయార్క్ లో ఉన్న టైమ్ స్వ్కేర్ తరహాలో హైదరాబాద్ లోనూ టీ–స్క్వేర్ నిర్మించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. రాయ దుర్గం, హైటెక్ సిటీ ప్రాంతాల్లో టీ-స్క్వేర్ నిర్మాణం కోసం టెండర్లు ఆహ్వానించింది. ఇదే సమయంలో మీర్ అలం చెరువులో లండన్ తరహా హైదరాబాద్ ఐ నిర్మించేందుకు సిద్ధమవటం విశేషం. మీర్ అలం చెరువు సమీపంలో నెహ్రూ జూలాజికల్ కూడా ఉండటంతో పర్యాటకులు విశేషంగా వచ్చే అవకాశం ఉంది.
నవాబులు నిర్మించిన చెరువు
మీర్ అలం చెరువును నిజాం కాలంలో నిర్మించారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ (జంట జలాశయాలు)కు ముందు హైదరాబాద్ నగరానికి మీర్ అలం చెరువు నీరే ఆధారం. ఈ నీరే నగర వాసుల దాహార్తి తీర్చేది. హైదరాబాద్ రాష్ట్ర మూడో నిజాం హయాంలో ఈ చెరువు నిర్మించారు. అప్పటి రాష్ట్ర ప్రధాన మంత్రి మీర్ ఆలం బహదూర్ పేరు మీద ఈ చెరువు నిర్మాణం జరిగింది. మీర్ ఆలం 20 జూలై 1804న ట్యాంక్‌కు పునాది వేయగా... 8 జూన్ 1806న చెరువు నిర్మాణం పూర్తయింది. దీనిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దనుండటం వల్ల పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.