విజయ్ హజారే ట్రోఫీలో కర్ణాటక ప్లేయర్ దేవ్ దత్ పడికల్ పరుగుల వరద పారిస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న సీజన్ లో అసాధారణ ఫామ్ తో దూసుకెళ్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్ ల్లో 600 పైగా పరుగులు సాధించి సరికొత్త చరిత్ర సృష్టించాడు. మంగళవారం (జనవరి 6) రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్ లో 91 పరుగులు చేసి ఈ టోర్నీలో 600 పరుగులను పూర్తి చేసుకున్నాడు. ఓవరాల్ గా 6 మ్యాచ్ ల్లో ఈ కర్ణాటక బ్యాటర్ 605 పరుగులు చేసి ఈ సీజన్ లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ గా కొనసాగుతున్నాడు. పడికల్ వరుసగా మూడోసారి విజయ్ హజారే ట్రోఫీ సీజన్ లో 600 పైగా పరుగులు చేయడం విశేషం.
విజయ్ హజారే ట్రోఫీలో ఒక ప్లేయర్ మూడు సీజన్ లలో 600 పైగా పరుగులు చేయడం ఇదే తొలిసారి. దీంతో ఈ టోర్నీలో పడికల్ మూడు సీజన్ లో 600 పైగా పరుగులు చేసిన తొలి ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు. 2019-2020 సీజన్ లో 67.66 యావరేజ్ తో 609 పరుగులు.. 2020-2021 సీజన్ లో 147.40 యావరేజ్ తో 737 పరుగులు చేశాడు. ఇక ప్రస్తుతం జరుగుతున్న సీజన్ లో 605 పరుగులు చేసి తన పరుగుల ప్రవాహాన్ని కొనసాగిస్తున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో ఇప్పటివరకు 6 మ్యాచ్ లాడిన పడికల్ నాలుగు సెంచరీలు బాదేశాడు. శనివారం (జనవరి 3) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో త్రిపురపై సెంచరీతో సత్తా చాటిన పడికల్ ఈ సీజన్ లో నాలుగో సెంచరీ నమోదు చేశాడు.
►ALSO READ | IND vs NZ: వడోదరకు టీమిండియా.. జట్టుతో వెళ్లని అయ్యర్, పంత్.. కారణమిదే!
జార్ఖండ్‌పై 147 పరుగులతో ఈ టోర్నీలో తొలి సెంచరీ తన ఖాతాలో వేసుకున్న ఈ కర్ణాటక బ్యాటర్.. ఆ తర్వాత కేరళపై 124 పరుగులు చేశాడు. తమిళనాడుపై 22 పరుగులు మాత్రమే చేసినా.. పుదుచ్చేరిపై 113 పరుగులతో మరో సెంచరీ చేశాడు. ఆ తర్వాత త్రిపురపై సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్ లో ఓవరాల్ 120 బంతుల్లో 108 పరుగులు చేసి జట్టు భారీ స్కోర్ చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఓవరాల్ గా లిస్ట్ ఎ ఫార్మాట్‌లో పడిక్కల్‌కు 13వ సెంచరీ. మంగళవారం (జనవరి 6) రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్ లో 91 పరుగులు చేసి ఈ టోర్నీలో 600 పరుగులను పూర్తి చేసుకున్నాడు.
2019-20లో పడికల్ తొలిసారి విజయ్ హజారే ట్రోఫీ ఆడినప్పుడు 11 మ్యాచ్‌ల్లో 67 యావరేజ్ తో 609 పరుగులతో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఆ తర్వాత ఏడాది ఇదే టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. 7 మ్యాచ్‌ల్లో 147 యావరేజ్ తో 737 పరుగులు చేసి ఆశ్చర్యపరిచాడు. 2023-24 సీజన్‌లో కేవలం 5 మ్యాచ్‌ల్లో 155 యావరేజ్ తో 465 పరుగులు.. గత సీజన్ లో 3 ఇన్నింగ్స్‌ల్లో 65 యావరేజ్ తో 196 పరుగులు చేసి అసాధారణ నిలకడ చూపించాడు. ఇంత నిలకడతో ఆడుతున్నా పడికల్ కు ఇప్పటివరకు టీమిండియాలో పిలుపు రాకపోవడం విచారకరం.
