
- ప్రజలతో మంత్రులు పొన్నం, తుమ్మల ముఖాముఖి
- సమస్యల పరిష్కారానికి హామీ
జూబ్లీహిల్స్, వెలుగు: హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల కల్పనకు పూనుకుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆదివారం జూబ్లీహిల్స్ నియోజకవర్గం సోమాజిగూడ డివిజన్ లో జయ ప్రకాశ్ కాలనీ, ఇంజినీర్స్ కాలనీ ప్రజలతో మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు ముఖాముఖి కార్యక్రమంలో నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికుల తమ సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి పొన్నం మాట్లాడుతూ.. హైదరాబాద్లో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు జూబ్లీహిల్స్ ఎన్నికల కోసం కాదని, రాష్ట్రానికి గుండెకాయ లాంటి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకని చెప్పారు.
జూబ్లీహిల్స్ అభివృద్ధికి దూరమైంది కాబట్టే సమస్యల పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఇటీవల ఈ ప్రాంతంలో డ్రైనేజీ సమస్య ఉందని తమ దృష్టికి తీసుకురాగా.. వెంటనే రూ. 40 లక్షల వ్యయంతో పనులు చేపట్టామన్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన అందరికీ తప్పక అందుతాయన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రానున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కార్పొరేటర్లు సీఎన్ రెడ్డి, వనం సంగీత యాదవ్ తదితరులు పాల్గొన్నారు.