కొమురవెల్లి మల్లన్నఆలయ పనులు స్లో..నాలుగేండ్లుగా కొనసాగుతున్న 50 గదుల సత్రం పనులు

కొమురవెల్లి మల్లన్నఆలయ పనులు స్లో..నాలుగేండ్లుగా కొనసాగుతున్న 50 గదుల సత్రం పనులు
  • రెండేళ్లు  దాటినా పూర్తి కాని క్యూ కాంప్లెక్స్
  • 100 గదుల సత్రం నిర్మాణానికి దొరకని అనుమతి 
  • పెండింగ్ లోనే ఢమరుకం, త్రిశూలం, స్వర్ణ కిరీటాల పనులు

సిద్దిపేట, వెలుగు: కొమురవెల్లి మల్లన్న ఆలయ అభివృద్ధి పనులు స్లోగా జరుగుతున్నాయి. భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేయాల్సిన పనులు ఏండ్లకేండ్లుగా సాగుతూనే ఉన్నాయి. మరికొద్ది రోజుల్లో మల్లన్న కల్యాణ మహోత్సవంతో పాటు మూడు నెలల మహా జాతర ప్రారంభం అవుతున్నా అభివృద్ధి పనులు కొలిక్కి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. 

ప్రతిపాదనల్లోనే కాటేజీల నిర్మాణం

దాతల సహకారంతో మూడెకరాల్లో 100 గదుల కాటేజీ నిర్మాణం ప్రతిపాదనల్లోనే మగ్గుతోంది. రూ.12 కోట్లతో నిర్మించే కాటేజీల నిర్మాణానికి దాతల సహకారం తీసుకోవాలని నిర్ణయించి దేవాదాయ శాఖకు ప్రతిపాదనలను పంపి ఏడాది కావస్తున్నా ఎలాంటీ ఉత్తర్వులు వెలువడలేదు. ఇప్పటికే కాటేజీల నిర్మాణానికి 12 మంది భక్తులు రూ.15 లక్షల చొప్పున విరాళాలు అందజేశారు. అనుమతులు లభిస్తే మరికొంత మంది దాతలు పెద్ద ఎత్తున విరాళాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా దీని పై ఎలాంటి ప్రగతి లేదు.

కొనసాగుతున్న క్యూ కాంప్లెక్స్ పనులు

భక్తుల  కోసం ఏర్పాటుచేస్తున్న క్యూ కాంప్లెక్స్ పనులు ప్రారంభమై రెండేల్లు గడుస్తున్నా ఇంకా పూర్తి కాలేదు. ఇందుకోసం సేకరించిన 2 వేల గజాల ప్రైవేట్ స్థలంలో చలువ పందిళ్లు వేసి తాత్కాలిక క్యూ లైన్లు ఏర్పాటు చేసి కాలం వెల్లదీస్తున్నారు. జీ ప్లస్ టూ పద్దతిలో ఇంద్రకీలాద్రిపై నిర్మించిన క్యూ కాంప్లెక్స్  తరహాలో రూ.12 కోట్ల నిధులతో  నిర్మాణానికి  ప్లాన్  చేసినా ఇప్పటికీ 70 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. దీంతో రద్దీ సమయాల్లో భక్తులు ఎండలోనే దర్శనానికి నిలబడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. 

పెండింగ్ లో మరికొన్ని పనులు 

ఆలయ పరిధిలో ఢమరుకం, త్రిశూలం, దాచారం గుట్టపై గెస్ట్ హౌజ్ ల నిర్మాణం పెండింగ్ లోనే ఉంది. రూ.68 లక్షలతో  మల్లన్న గుట్టపై 300 అడుగుల ఎత్తులో సుతుమాని గుండుపై త్రిశూలం, ఢమరుకం నిర్మాణ పనులు ఏడాది కింద ప్రారంభించినా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దాచారం గుట్టపై వీఐపీ కాటేజీల నిర్మాణం కోసం ప్రతిపాదనలు రూపొందించినా ఇంత వరకు కార్యరూపం దాల్చలేదు. గుట్ట పైకి  దారికోసం నాలుగున్నర కోట్లు ఖర్చు పెట్టినా ఇంత వరకు కాటేజీల నిర్మాణం మాత్రం ప్రారంభంకాలేదు. 

స్వర్ణ కిరీటాలపై స్పష్టత కరవు

మల్లికార్జున స్వామి భార్యలైన బలిజ మేడల దేవి, గొల్ల కేతమ్మకు స్వర్ణ కిరీటాలు తయారు చేయాలని సంకల్పించి ఏడాది దాటినా ఇప్పటికీ  కార్యరూపం దాల్చలేదు. భక్తులు సమర్పించిన బంగారంతో 2 స్వర్ణ కిరీటాలు రెండు కిలోల చొప్పున చేయించాలని నిర్ణయించినా ప్రతిపాదనలు కాగితాల్లోనే మగ్గుతున్నాయి. భక్తులు సమర్పించిన బంగారం అందుబాటులో ఉండి డిజైన్లు సిద్ధమైనా స్వర్ణ కిరీటాల తయారీకి అధికారుల నుంచి అనుమతి రావడం లేదు.

అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేస్తాం

కొమురవెల్లి ఆలయ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం. రెండు నెలల్లో ప్రారంభమయ్యే మహా జాతర నాటికి క్యూ కాంప్లెక్స్ పనులు పూర్తి చేసి ప్రారంభిస్తాం. బండగుట్టపై జరుగుతున్న సత్రం పనులను పంచాయతీ రాజ్ శాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. వీటిని త్వరగా పూర్తి చేయాలని సూచించాం. కొన్ని అభివృద్ధి పనులకు సంబంధించి నిధుల కొరత ఏర్పడింది. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. - టంకశాల వెంకటేశ్, ఈవో, కొమురవెల్లి దేవస్థానం