శివసేన కలిసొస్తుంది.. కూటమి సర్కారు
దేవేంద్ర ఫడ్నవిస్ ధీమా..
రెండోసారి బీజేఎల్పీ నేతగా ఎన్నిక
అపోజిషన్గానే ఉంటామంటూ ఎన్సీపీ, కాంగ్రెస్ క్లారిటీ
సైలెంటైపోయిన శివసేన..
నేటి ఎల్పీ భేటీ తర్వాత ప్రకటన వెలువడే అవకాశం
మహారాష్ట్రలో బీజేపీ–శివసేన కూటమి ప్రభుత్వమే ఏర్పాటవుతుందని, వచ్చే ఐదేండ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని దేవేంద్ర ఫడ్నవీస్ ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ముంబైలోని విధాన భవన్లో జరిగిన బీజేఎల్పీ మీటింగ్‌లో 105 మంది ఎమ్మెల్యేలు తమ నేతగా ఫడ్నవీస్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ భేటీకి సెంట్రల్ అబ్జర్వర్లుగా కేంద్రమంత్రి నరేంద్ర తోమర్, బీజేపీ వైస్ ప్రెసిడెంట్ అవినాశ్ రాయ్ ఖన్నా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలను ఉద్దేశించి సీఎం ఫడ్నవీస్ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు కూటమికే పట్టం కట్టారని, ఆ మేరకు అతి త్వరలోనే శివసేన కలిసొస్తుందని, కొద్దిరోజుల్లోనే కొత్త సర్కారు కొలువుదీరుతుందని, ఈ విషయంలో ఎవరికీ అనుమానాలు అక్కర్లేదని భరోసా ఇచ్చారు. ‘‘ఈలోపే ప్రతిపక్షాలతో కలిసి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందనేది కేవలం పుకారే. అలాంటివాటిని ఎంటర్టైన్మెంట్గానే తప్ప సీరియస్‌గా చూడొద్దు.
వాస్తవానికి సేన సర్కారు ఫాం చేసే అవకాశం లేనేలేదు’’అని అన్నారు. సరిగ్గా అదే సమయానికి తాము ప్రతిపక్షంలోనే కూర్చుంటాం తప్ప శివసేనతో కలిసి నడవబోమని ప్రతిపక్ష ఎన్సీపీ, కాంగ్రెస్‌లు కీలక ప్రకటన చేశాయి. దీంతో శివసేన దాదాపుగా మెత్తబడింది. బుధవారం ఆ పార్టీ నేతలెవరూ దూకుడు ప్రకటనలు చేయలేదు. గురువారం శివసేన ఎమ్మెల్యేలు తమ ఎల్పీ నేతను ఎన్నుకోనున్నారు. ఆ మీటింగ్ తర్వాత పార్టీ చీఫ్ ఉద్దవ్ థాక్రే.. బీజేపీతో కలిసి నడిచే విషయమై కీలక ప్రకటన చేస్తారని తెలిసింది. మొత్తం 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ 105, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 46 సీట్లను గెల్చుకోగా, మిగిలిన 29 స్థానాల్లో చిన్నపార్టీల కేండిడెట్లు, ఇండిపెండెంట్లు విజయం సాధించారు.
దేవేంద్ర చాణక్యం
ఫిఫ్టీ–ఫిఫ్టీ ఫార్ములాపై మంకుపట్టుపట్టిన శివసేనను దారికి తెచ్చుకునే విషయంలో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. బుధవారం నాటి బీజేఎల్పీ మీటింగ్‌కు బీజేపీ చీఫ్ అమిత్ షా హాజరుకావాల్సిఉండగా, చివరి నిమిషంలో షా బదులు కేంద్ర మంత్రి తోమర్, పార్టీ వైస్ ప్రెసిడెంట్ రాయ్‌ని అబ్జర్వర్లుగా పంపుతున్నట్లు హైకమాండ్ ప్రకటించింది. ఫడ్నవీస్ రిక్వెస్ట్ మేరకే అమిత్ షా ముంబై టూర్‌ను రద్దు చేసుకున్నట్లు తెలుస్తున్నది. ముందే నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం అమిత్ షా.. శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రేతోనూ సమావేశం కావాల్సిఉంది. ఆ మీటింగ్ జరిగితే బీజేపీ చీఫ్ ముందు ఫిఫ్టీ ఫిఫ్టీ ఫార్ములాపై థాక్రే తన వాదన మరోసారి వినిపించేవారు. దేవేంద్ర చాణక్యంతో థాక్రేకు ఆ అవకాశం లేకుండా పోయింది. ఈలోపే ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించబోమంటూ ప్రకటించడంతో శివసేనకు వేరే ఆప్షన్స్ లేకుండాపోయాయి. బుధవారం మరో ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు సీఎం ఫడ్నవీస్‌కు మద్దతు ఇస్తామని ప్రకటించారు. అంతకుముందే ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీకి సపోర్ట్ చేస్తామని లేఖలు రాశారు.
ఫ్లోర్ టెస్టులో ఫడ్నవీస్ ఫెయిలైతేనే
మహారాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఎన్సీపీ శాసనసభా పక్ష నేతగా ఎన్నికయ్యారు. బుధవారం ముంబైలో సమావేశమైన 54 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు తమ నేతగా అజిత్ పవార్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ఎన్సీపీ నేషనల్ చీఫ్ శరద్ పవార్‌తోపాటు పార్టీ ఎంపీలు, ఇతర ముఖ్యనేతలు హాజరయ్యారు. మహారాష్ట్రలో కొత్త సర్కారు ఏర్పాటుపై ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ కీలక ప్రకటన చేశారు. ఓటర్లు ఇచ్చిన తీర్పు మేరకు ఎన్సీపీ, కాంగ్రెస్ ప్రతిపక్షంలోనే కూర్చుంటాయని స్పష్టం చేశారు. ముందుకుముందే శివసేనతో కలిసి సర్కారు ఏర్పాటుకు ప్రయత్నించబోమని, ఒకవేళ సీఎం ఫడ్నవీస్ అసెంబ్లీ ఫ్లోర్ టెస్టులో ఫెయిలైతేనే ప్రత్యామ్నయాలపై దృష్టిపెడతామని పాటిల్ కుండబద్దలుకొట్టారు.
పరిశీలనలోని ఫార్ములాలు
కొత్తగా ఏర్పడబోయే కూటమి ప్రభుత్వంలో శివసేనకు సముచిత స్థానం కల్పించాలనుకుంటున్న బీజేపీ రెండు ఫార్ములాల్ని పరిశీలిస్తున్నది.
- ఒక డిప్యూటీ సీఎం పోస్టుతోపాటు 13 మంత్రి పదవులు.
2. ఫడ్నవీస్ కేబినెట్లో చేరనట్లయితే కేంద్ర కేబినెట్లో సేనకు అదనంగా రెండు కేబినెట్ ర్యాంకు బెర్తులు.
