భరతనాట్యం చేస్తూ.. తిరుమల ఏడు కొండలు ఎక్కిన కళాకారుడు

భరతనాట్యం చేస్తూ.. తిరుమల ఏడు కొండలు ఎక్కిన కళాకారుడు

తిరుమల ఏడుకొండలు మామూలుగానే ఎక్కాలంటే దేవుడు కనిపిస్తాడు.. అలాంటిది నాట్యం చేస్తూ.. భరతనాట్యం చేస్తూ శ్రీవారి మెట్టు నుంచి తిరుమలకు చేరుకున్నాడు ఓ కళాకారుడు. ఈ మార్గంలో భక్తులు.. సాధారణంగా నడుస్తూ వెళ్లాలంటే కనీసం రెండు గంటల సమయం పడుతుంది. అలాంటి ఈ కళాకారుడు కేవలం 75 నిమిషాల్లోనే ఏడుకొండలు ఎక్కేయటం విశేషం. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన డాక్టర్ కృష్ణ వాసు.. భరత నాట్యం కళాకారుడు కూడానూ. పల్నాడులోని శ్రీ వేంకటేశ్వర వేద విజ్ణాన పీఠం ఆధ్వర్యంలోని కోటప్పకొండ విద్యాలయంలో సంస్కృత టీచర్ గా పని చేస్తున్నారు. తనకు బాగా వచ్చిన భరతనాట్యం చేస్తూ.. తిరుమల కొండ ఎక్కాలని శ్రీవారికి మొక్కుకున్నాడు. అందులో భాగంగానే.. జులై 12వ తేదీన తిరుపతి చేరుకుని.. శ్రీవారి మెట్టు మార్గం నుంచి నాట్యం చేస్తూ తిరుమల చేసుకున్నాడు డాక్టర్ కృష్ణ వాసు. 

అన్నమయ్య, త్యాగయ్య సంకీర్తనలు చేస్తూ.. అందుకు తగ్గట్టు భరత నాట్యం చేస్తూ మెట్లు ఎక్కారు. మధ్యలో భక్తులతోనూ నాట్యం చేయిస్తూ.. సంకీర్తనలు పాడిస్తూ ఎంతో ఉల్లాసంగా.. చకచకా కొండ ఎక్కేశారు ఈ కళాకారుడు. నేటి యువతలో సంస్కృతి సంప్రదాయాలు, కళలపై అవగాహన కల్పించటంతోపాటు.. భరతనాట్యం విశిష్ఠతను తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే ఇలా చేసినట్లు చెబుతున్నారు. గతంలో ఎవరూ ఇలా భరతనాట్యం చేస్తూ శ్రీవారి మెట్లను ఎక్కలేదని తెలియజేశారు. తన ప్రయత్నం ఫలించాలని.. యువతకు అవగాహన రావాలని వేంకటేశ్వరస్వామిని కోరుకుంటున్నట్లు చెప్పారు కళాకారుడు కృష్ణ వాసు.