వేములవాడరూరల్, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ శ్రీ భీమేశ్వర స్వామి వారి సన్నిధిలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. ఆలయానికి విచ్చేసిన భక్తులు స్వామివారిని దర్శించుకుని, కోడె మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు సౌకర్యాలు కల్పించారు.
కాగా ప్రసిద్ధ ప్రవచనకర్త బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి, పీఎం సలహాదారుడు ఆదిత్య దీక్షిత్ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామి వారి మండపంలో ఆలయ అర్చకులు, వేద పండితులు వారికి వేద మంత్రాలతో ఆశీర్వచనాలు, శేష వస్త్రం, లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు.
ఆలయ అభివృద్ధికి రూ.10 లక్షల విరాళం
రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధికి భక్తులు విరాళాలు అందజేస్తున్నారు. ఆదివారం హైదరాబాద్ సోమాజిగూడకు చెందిన భక్తులు నీలగిరి శంకర్‌రావు–ప్రసూన దంపతులు ఆలయ అభివృద్ధికి రూ.10 లక్షల విరాళాన్ని అందజేశారు. ఈ విరాళాన్ని దేవస్థానం ఈవోకు అందజేశారు. అర్చకులు దాతలకు ఆశీర్వచనం చేసి ప్రసాదం అందజేశారు.

