చలువ పందిళ్లు ఎన్నాళ్లు?.. దర్శనానికి తప్పని తిప్పలు

చలువ పందిళ్లు ఎన్నాళ్లు?.. దర్శనానికి తప్పని తిప్పలు
  • ముందుకు సాగని మల్లన్న క్యూ కాంప్లెక్స్ నిర్మాణం 
  • ఏడాది గడుస్తున్నా ప్రారంభం కాని పనులు
  • దర్శనానికి తప్పని తిప్పలు

సిద్దిపేట/కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లన్న దర్శనానికి వచ్చే భక్తులకు తిప్పలు తప్పడం లేదు. ఏడాది గడుస్తున్నా క్యూ కాంప్లెక్స్ నిర్మాణ పనులు ప్రారంభం కాకపోవడంతో మండుటెండ్లలో చలువ పందిళ్ల కింద బారులు తీరాల్సి వస్తోంది. ఎండవేడిమి, ఉక్కపోతను తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నామని, వారాంతాల్లో దర్శనానికి గంటల సమయం పడుతుండడంతో పరిస్థితి దారుణంగా ఉంటోందని వారు వాపోతున్నారు.  అధికారులు క్యూ కాంప్లెక్స్‌ నిర్మించకుండా.. దానికోసం సేకరించిన స్థలంలో చలువ పందిళ్లు వేసి తాత్కాలిక క్యూ లైన్లు ఏర్పాటు చేసి వదిలేయడం గమనార్హం.

 ఎకరం స్థలంలో..

మల్లన్న ఆయన పాలకవర్గం రాజగోపురానికి ఎడమ వైపున ఎకరం స్థలంలో క్యూ కాంప్లెక్స్ నిర్మించాలని నిర్ణయించారు.  ఇక్కడ ప్రైవేట్‌ వ్యక్తులకు చెందిన 11 ఇండ్లు ఉండటంతో ఆలయ అధికారులు యజమానులకు చర్చలు జరిపి ఖాళీ చేసేందుకు ఒప్పించారు.  వారికి గోశాల వద్ద అంతే స్థలాన్ని ఇవ్వడంతో పాటు స్ట్రక్చర్ వాల్యూ కింద రూ. 78 లక్షల పరిహారాన్ని అందించారు.  అనంతరం ఇండ్లను తొలగించడంతో 2 వేల గజాల ఖాళీ స్థలం అందుబాటులోకి వచ్చింది.  పక్కనే ఆలయానికి సంబంధించిన మరో 2 వేల గజాల స్థలం ఉండగా.. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్నట్టు జీ ప్లస్ టూ తరహాలో రూ.12 కోట్లతో క్యూ కాంప్లెక్స్ నిర్మించేందుకు ప్లాన్ రెడీ చేశారు. ఇందులో తాగునీటి వసతి, టాయిలెట్స్, ఎసీలతో పాటు  ప్రత్యేక స్టాళ్లు,  కంపార్ట్ మెంట్లు.. ఇలా అన్ని వసతులు కల్పిస్తామని ప్రకటించారు. 

ఏడాది గడిచినా..

క్యూ కాంప్లెక్స్ నిర్మాణం కోసం స్థలాన్ని సేకరించి ఏడాది గడిచినా పనులు ప్రారంభం కావడం లేదు. ఇదే స్థలంలో చలువ పందిళ్లు వేసి తాత్కాలిక క్యూ లైన్లు ఏర్పాటు చేశారే తప్ప శాశ్వత ప్రణాళిక అమలు దిశగా చర్యలు తీసుకోలేదు.  ఇక్కడి నుంచి వెళ్లిపోయిన ప్రైవేటు వ్యక్తులు తమకు కేటాయించిన స్థలాల్లో ఇండ్లు నిర్మించుకుని గృహ ప్రవేశాలు కూడా చేశారు కానీ, క్యూ కాంప్లెక్స్‌ పనులు మాత్రం ఏడియాడనే ఉన్నాయి.  మొదట రూ.5 కోట్లతో నిర్మించాలని అనుకున్నా క్యూ కాంప్లెక్స్‌ వ్యయాన్ని రూ.12 కోట్లకు పెంచారే తప్ప పనులు మాత్రం ప్రారంభించడం లేదు. దీంతోచలువ పందిళ్ల కింద భక్తులు ఇబ్బంది పడుతున్నారు.  

త్వరలో పనులు ప్రారంభిస్తాం 

క్యూ కాంప్లెక్స్ నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభిస్తాం. రూ. 12 కోట్లతో చేపట్టనున్న పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ ఇటీవలే పూర్తయింది. కాంట్రాక్టు పొందిన సంస్థతో అగ్రిమెంట్లు పూర్తి కాగానే పనులు ప్రారంభించి గడువులోగా పూర్తి చేస్తాం. పలు కారణాల వల్ల  జాప్యం జరిగిన మాట వాస్తవమే.. ఇకపై ఎలాంటి ఆటంకాలు లేకుండా చూస్తాం. - శంకర్, మల్లన్న టెంపుల్ ఏఈ