భక్తులతో పోటెత్తిన భద్రగిరి

భక్తులతో పోటెత్తిన భద్రగిరి
  • సీతారామయ్యకు అభిషేకం, 
  • బంగారు పుష్పార్చన
  • ఘనంగా సత్యనారాయణస్వామి వ్రతాలు

భద్రాచలం, వెలుగు : భద్రగిరికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం కావడంతో ఆదివారం గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి సీతారాముల దర్శనం కోసం తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భద్రాద్రికి క్యూ కట్టారు. ఉదయం గోదావరి నుంచి తీర్ధబిందెను తీసుకొచ్చి గర్భగుడిలో మూలవరులకు సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం పంచామృతాలతో అభిషేకం, మూలవరులకు మంజీరాలను అద్ది తిరుమంజనం చేశారు. 

భక్తులకు అభిషేక జలాలను పంపిణీ చేశారు. మూలవరులను సుందరంగా అలంకరించి బంగారు పుష్పాలతో అర్చన నిర్వహించారు. స్వామి దర్శనం కోసం భక్తులు క్యూ లైన్లలో గంటల తరబడి వేచి చూశారు. అభిషేకం అనంతరం స్వామి దర్శనానికి భక్తులు ఎగబడ్డారు. 

కల్యాణమూర్తులను బేడా మండపానికి తీసుకొచ్చి విశ్వక్షేన పూజ, పుణ్యాహవచనం, ఆరాధన చేసి యజ్ఞోపవీతం, కంకణధారణ, జీలకర్రబెల్లం, సుముహూర్తం, మాంగల్యధారణ, తలంబ్రాల వేడుక, మంత్రపుష్పం సమర్పించి కల్యాణ క్రతువును ముగించారు. సాయంత్రం దర్బారు సేవ చేసి సీతారాములకు దివిటీ సలాం సమర్పించారు. అంతకుముందు చిత్రకూట మండపంలో సత్యనారాయణస్వామి వ్రతాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.