కొమురవెల్లి మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు

కొమురవెల్లి మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు

కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లన్న ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. శనివారం నుంచే ఆలయానికి చేరుకున్న భక్తులు దేవస్థానం సత్రాలు, ప్రైవేట్​గదుల్లో బసచేశారు. తెల్లవారుజామున కోనేరులో స్నానాలు చేసి మల్లికార్జునస్వామి ని దర్శించుకున్నారు. 

అనంతరం స్వామివారికి పట్నం వేసి నిత్యకల్యాణం జరిపించారు. గంగరేగు చెట్టుకు ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మల్లన్న గుట్టపైన కొలువైవున్న రేణుక ఎల్లమ్మ, నల్ల పోచమ్మ అమ్మవార్లను బోనం సమర్పించారు.

 మల్లన్నస్వామిని దర్శించుకున్న కలెక్టర్ 

కార్తీక మాసం పురస్కరించుకుని కలెక్టర్ హైమావతి కుటుంబ సభ్యులతో కలిసి కొమురవెల్లి మల్లికార్జునస్వామిని దర్శించుకున్నారు. ఆలయ ఈఓ వెంకటేశ్వర్లు, వేద పండితులు కలెక్టర్ కుటుంబానికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. 

ఆలయంలోకి తీసుకెళ్లి పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. వచ్చే నెలలో జరిగే మల్లన్న కల్యాణం, ఉగాది వరకు జరిగే జాతరకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు.