కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. శనివారం నుంచి ఆలయానికి చేరుకున్న భక్తులు దేవస్థానం సత్రాలు, ప్రైవేట్గదుల్లో రాత్రి బస చేశారు. తెల్లవారుజామున కోనేరులో పవిత్ర స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు.
మల్లన్నకు పట్నం, అభిషేకం, దీపాలు వెలిగించడం, అర్చన, నిత్యాకల్యాణం, బోనం, తిరుగుడు కోడె, కేశకండన, గంగి రేగు చెట్టుకు ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మల్లన్న గుట్టపైన కొలువైవున్న రేణుక ఎల్లమ్మ, నల్ల పోచమ్మ అమ్మవార్లను దర్శించుకొని బోనాలు సమర్పించారు. కార్తీక మాసం పురస్కరించుకొని ఆలయ ముఖ మండపంలో లింగాకృతిలో దీపోత్సవం నిర్వహించారు. ఆలయ సిబ్బంది భక్తులకు ప్రమిదలు, పూజ సామగ్రి సమకూర్చారు. కార్యక్రమంలో ఈవో వెంకటేశ్, ఏఈఓ శ్రీనివాస్, పర్యవేక్షకుడు శేఖర్, ప్రధానార్చకుడు మల్లికార్జున్, అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
